ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ ప్రకారం, శిశు మరణాల రేటు తగ్గించడంలో భారత్ ప్రయత్నాలు ఆదర్శంగా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఆరోగ్య వ్యవస్థలో పెట్టుబడులు, ఆరోగ్య సదుపాయాల పెంపుతో మరణాల రేటు బాగా తగ్గింది.
శిశు మరణాల రేటు తగ్గింపులో భారత్ కృషి, ప్రగతి 'ఆదర్శం' అని ఐక్యరాజ్యసమితి మెచ్చుకుంది. మంగళవారం విడుదలైన శిశు మరణ అంచనా రిపోర్టులో భారత్, నేపాల్, సెనెగల్, ఘనా, బురుండి దేశాలు పిల్లల మరణాలను తగ్గించడానికి తీసుకున్న రకరకాల పద్ధతులను చూసి 'ఆదర్శ దేశాలు' అని పొగిడింది.
'ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ కింద ప్రతి కుటుంబానికి రూ.4.7 లక్షల వరకు బీమా ఇస్తున్నారు. దీని ద్వారా ఆరోగ్య వ్యవస్థపై పెట్టుబడి పెట్టిన భారత్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడింది. 2000 సంవత్సరం నుంచి 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు 70%, నవజాత శిశువుల మరణాల రేటు 61% తగ్గింది. ఆరోగ్య సదుపాయాల పరిధి పెంచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, మానవ వనరులను అభివృద్ధి చేయడం ద్వారా ఇది సాధ్యమైంది' అని రిపోర్టులో చెప్పారు.