అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ వాహనాలపై 25% పన్ను వేశారు. దీని వల్ల పలు ఆటోమొబైల్ వాహన తయారీ కంపెనీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ విషయానికొస్తే వాహన విడిభాగాల ఎగుమతులపై ప్రభావం పడుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి అయ్యే వాహనాలు, వాటి విడిభాగాలపై 25% పన్ను విధించారు. దీని వల్ల అంతర్జాతీయ వాహన పరిశ్రమపై గట్టి దెబ్బ పడింది. అమెరికాలో ఆటోమొబైల్ పరిశ్రమను తిరిగి అభివృద్ధి చేయడం, ఉద్యోగాలు సృష్టించడం కోసం ఈ పన్ను వేశారు. దీని వల్ల జపాన్, యూరోపియన్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఈ కొత్త పన్ను ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
అమెరికాలో తయారవ్వని వాహనాలపై 25% పన్ను విధిస్తాం. మన దగ్గర వ్యాపారం చేస్తూ మన ఉద్యోగాలు, డబ్బులు చాలా ఏళ్లుగా తీసుకుపోతున్న వాళ్లపై పన్ను వేయాలని నిర్ణయించాం అని ట్రంప్ అన్నారు. దీనిపై ఎలాంటి చర్చలు ఉండవని కూడా ఆయన తేల్చి చెప్పారు. దీని ద్వారా అమెరికాకు ఏటా 8.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
భారత్ పై దీని ప్రభావం ఏంటి?
ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాకు భారత్ నుంచి వెళ్లే వాహనాలు చాలా తక్కువ. 2024లో అమెరికాకు భారత్ నుంచి 72 కోట్ల రూపాయల విలువైన ప్యాసింజర్ కార్లు ఎగుమతి అయ్యాయి. దేశం నుంచి మొత్తం 60 లక్షల కోట్ల విలువైన వాహనాలు ఎగుమతి అవుతున్నాయి. అంటే కేవలం 0.13% కార్లు మాత్రమే అమెరికాకు వెళ్తున్నాయి. ఇంకా భారత్ నుంచి 107 కోట్ల విలువైన ట్రక్కులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్ లో భారత్ ట్రక్కుల ఎగుమతిలో 0.89% అని చెప్పారు.
అయితే దేశంలోని వాహనాల విడిభాగాల పరిశ్రమపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. 2023లో భారత్ 12,850 కోట్ల రూపాయల విలువైన ఆటో విడిభాగాలను అమెరికాకు ఎగుమతి చేసింది. కొత్త పన్ను విధానం వల్ల భారత్ నుంచి ఆటో విడిభాగాలను తెప్పించుకోవడం అమెరికా కంపెనీలకు భారంగా మారుతుంది. దీని వల్ల డిమాండ్ తగ్గిపోవచ్చు. అప్పుడు భారత్ వేరే దేశాల వైపు చూడాల్సి వస్తుంది అని అంటున్నారు.
భారత్ లో ఏ కంపెనీలపై దెబ్బ పడుతుంది?
టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, సోనా బీఎస్డబ్ల్యూ, సంవర్ధన్ మదర్సన్ కంపెనీలపై 25% పన్ను ప్రభావం పడుతుంది.