కామన్వెల్త్ డే 2025లో కింగ్ ఛార్లెస్, క్వీన్ కెమిల్లాకు ఇండియన్ మూవీ పాటతో స్వాగతం లభించింది. ఆ సూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా?
British Royal family welcomed with Dhoom Machale: బ్రిటన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగిన కామన్వెల్త్ డే 2025 వేడుకల్లో ఒక ప్రత్యేకమైన దృశ్యం కనిపించింది. ఈ వేడుకలో కింగ్ ఛార్లెస్, క్వీన్ కెమిల్లాకు బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ 'ధూమ్ మచాలే'తో స్వాగతం పలికారు. ఊహించని విధంగా వినిపించిన ఈ పాట ఈవెంట్ మొత్తాన్ని ప్రత్యేకంగా మార్చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ ప్రత్యేక ప్రదర్శనను అందించిన శ్రీ ముక్తజీవన్ స్వామిబాపా పైప్ బ్యాండ్ ఒక హిందూ-స్కాటిష్ పైప్ బ్యాండ్. ఇది స్కాట్లాండ్ బ్యాగ్ పైప్ ట్యూన్స్ ను భారతీయ సాంస్కృతిక అంశాలతో మిక్స్ చేస్తుంది.
అయితే, ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో ఈ విషయం పెద్దగా చర్చకు రాలేదు. కానీ బ్యాండ్ వాళ్ల ప్రదర్శన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్ అయింది. బ్రిటన్ లోని చాలా మీడియా సంస్థలు ఈ వీడియో నిజమైనదే అని నిర్ధారించాయి.
బాలీవుడ్ సినిమా 'ధూమ్ 2' అభిమానులకు ఈ ప్రదర్శన ఒక సర్ ప్రైజ్ లాంటిది. హృతిక్ రోషన్ బ్రిటిష్ రాణి వేషంలో కోహినూర్ దొంగిలించే సీన్ తో చాలామంది సోషల్ మీడియా యూజర్లు వెంటనే కనెక్ట్ అయ్యారు.
దీంతో ఈ యూజర్స్ సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ''రిలాక్స్ అబ్బాయిలూ, హృతిక్ రోషన్ కోహినూర్ (Kohinoor) తీసుకోవడానికి వెళ్ళాడు' అని కొందరు...ఇది 'ధూమ్ 4' సీక్రెట్ ప్రమోషన్ లో భాగమా అని ఇంకొందరు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు హృతిక్ రోషన్ ఇప్పుడు కెమిల్లా వేషం వేసుకున్నాడేమో అని కూడా కామెంట్ చేస్తున్నారు.
శ్రీముక్తజీవన్ స్వామిబాపా పైప్ బ్యాండ్ బ్రిటన్, ఇండియా, అమెరికా, కెన్యాలో తన బ్రాంచ్ లతో ఒక గ్లోబల్ మ్యూజికల్ గ్రూప్ గా ఎదిగింది. వాళ్ల ఈ ప్రత్యేక ప్రదర్శన భారతీయ పాప్ కల్చర్ (Indian Pop Culture) ఇప్పుడు బ్రిటీష్ రాజ కుటుంబం వరకు వెళ్లిందని చూపించింది. ఇది కేవలం ఒక మ్యూజిక్ ప్రదర్శన మాత్రమే కాదు, రెండు సంస్కృతుల కలయికకు (Cultural Fusion) ఒక గొప్ప ఉదాహరణ.