డొనాల్డ్ ట్రంప్.. పోర్న్ స్టార్ కేసు: హష్ మనీ కేసు ఏమిటీ? ట్రంప్ పై ఆరోపణలేమిటీ?

By Mahesh KFirst Published Mar 31, 2023, 1:31 PM IST
Highlights

డొనాల్డ్ ట్రంప్ పై ఓ పోర్న్ స్టార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై నేరపూరిత అభియోగాలు నమోదయ్యాయి. 2006లో ఆమెతో శారీరకంగా కలిశాడని, ఆ వివరాలను బహిర్గతం చేయకుండా ఉండటానికి డబ్బులు ముట్టజెప్పినట్టు వచ్చిన ఆరోపణలు వచ్చాయి. ఇంతకీ ఈ హష్ మనీ కేసు, ట్రంప్ పై ఆరోపణలు, 2006లో ఏం జరిగింది? వంటి వివరాలను స్థూలంగా ఐదు పాయింట్లలో చూద్దాం.
 

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్‌లో రిపబ్లికన్ నేతగా బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, డొనాల్డ్ ట్రంప్‌ను ఓ కేసు వెంటాడుతున్నది. 2016 అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో ఆయన ఓ పోర్న్ స్టార్ నోరుతెరవకుండా ఉండటానికి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిపాడనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన కేసు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ కాళ్లకు చుట్టుకుంటున్నది. ఇంతకీ ఈ కేసు ఏమిటీ? ట్రంప్ పై ఆరోపణలేమిటీ? అనే విషయాలను స్థూలంగా ఐదు పాయింట్లలో తెలుసుకుందాం.

1. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికకావడానికి ముందే డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ టైకూన్. సంపన్నుడు. 2006 జులైలో నిర్వహించిన ఓ గోల్ఫ్ టోర్నమెంట్‌‌లో ట్రంప్.. అడల్ట్ ఫిలిం నటి స్టార్మీ డేనియల్స్‌ను కలుసుకున్నాడు. అప్పుడు పోర్న్ స్టార్ డేనియల్స్‌కు 27 ఏళ్లు, ట్రంప్‌కు 60 ఏళ్లు. ట్రంప్ మూడో భార్య మెలానియా కొడుకు బారన్‌కు జన్మనిచ్చింది. అయితే, ట్రంప్‌ను కలవడాన్ని డేనియల్స్ తన పుస్తకం ‘ఫుల్ డిస్‌క్లోజర్’లో ప్రస్తావించింది. ఆ పుస్తకం 2018లో ముద్రితమైంది.

2. ఆ పుస్తకంలో డేనియల్స్.. డొనాల్డ్ ట్రంప్ గురించి రాసింది. ‘అప్రెంటిస్’స్టార్‌(ట్రంప్!)ఆయన ఇంటిలో డిన్నర్ కోసం ట్రంప్ బాడీగార్డులో ఒకరు డేనియల్స్‌ను ఆహ్వానించినట్టు రాసుకుంది. ఆ తర్వాత శారీరకంగా ఆయనతో కలిసినట్టు పేర్కొంది. తన శృంగార జీవితంలో అసంతృప్తిగా ఆ ఘటన ముగిసిందని వివరించింది. ట్రంప్ దేహ రూపం బాగాలేదని రాసింది.

Also Read: ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు..: నిజామాబాద్ లో రాత్రికి రాత్రే ప్లెక్సీలు (వీడియో)

3. కాగా, ఈ ఆరోపణలను డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. డేనియల్స్‌తో తాను ఎన్నడూ సెక్స్ చేయలేదని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కేవలం తన నుంచి డబ్బులు గుంజడానికే ఆమె ఈ ఆరోపణలు తెచ్చిందని పేర్కొన్నారు.

4. మళ్లీ 2016 సంవత్సరానికొస్తే.. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ బరిలో నిలిచారు. ఆ సమయంలో పోర్న్ స్టార్ డేనియల్స్ నోరు మూయడానికి, ట్రంప్ పై ఆరోపణలు (2006 విషయాలను మాట్లాడకుండా ఉండటానికి!) చేయకుండా ఉండటానికి ఆమెకు 1,30,000 అమెరికన్ డాలర్ల డబ్బు ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. ట్రంప్ పర్సనల్ లాయర్ మైఖేల్ కోహెన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ పేమెంట్ క్యాంపెయిన్ ఫైనాన్స్ చట్టాలను ఉల్లంఘించిందా? అనేదే ఇక్కడ ప్రధానంగా విచారించాల్సి ఉన్నది.

5. ఈ పేమెంట్‌ను 2018 జనవరిలో ది వాల్ స్ట్రీట్ జర్నల్ బహిర్గతం చేసింది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పై నేరపూరిత అభియోగాలకు ఇవే ఆధారంగా ఉన్నాయి.

click me!