ఇండియాతో కాల్పుల విరమణ తర్వాత, పాకిస్తాన్ కి చైనా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుతామని చెప్పింది. దీంతో చైనా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న మైత్రిని మరోసారి ప్రపంచాన్ని చాటి చెప్పింది.
భారత్తో కాల్పుల విరమణ తర్వాత, పాకిస్తాన్ చైనాతో చర్చలు జరిపింది. పాకిస్తాన్ కి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని చైనా చెప్పింది. ఇండియా, పాకిస్తాన్ మధ్య మూడు రోజులకు పైగా జరిగిన ఘర్షణలు ఆగిపోయాయి. అమెరికాతో సహా పలు దేశాల విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్రాన్ని కాపాడటంలో తమ దేశం పాకిస్తాన్ కి మద్దతుగా ఉంటుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి శనివారం చెప్పారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ చైనా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఆ సమయంలో ఇషాక్ దార్, మారుతున్న ప్రాంతీయ పరిస్థితుల గురించి వాంగ్ యి కి వివరించారు. క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ సంయమనాన్ని వాంగ్ యి అభినందించారు. పాకిస్థాన్ వైఖరిని ప్రశంసించారు.
ఈ విషయంపై విడుదల చేసిన ప్రకటనలో ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి మరోసారి తెరపైకి వచ్చింది. రాబోయే రోజుల్లో పాక్ తో సన్నిహిత సమన్వయాన్ని కొనసాగించడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. "పాకిస్తాన్ కి అన్ని పరిస్థితుల్లో వ్యూహాత్మక భాగస్వామిగా, నమ్మకమైన మిత్రదేశంగా ఉండే చైనా, దాని సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్రాన్ని కాపాడటంలో పాకిస్తాన్ కి తోడుగా నిలుస్తుందని మళ్ళీ ధృవీకరించారు" అని చైనా విదేశాంగ కార్యాలయం తెలిపింది.
ఇక పాకిస్తాన్, ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ స్వాగతించారు. ఇషాక్ దార్ వారితో కూడా మాట్లాడారు. టర్కీ విదేశాంగ మంత్రి హక్కన్ ఫిడాన్ తో కూడా ఇషాక్ దార్ చర్చలు జరిపి పరిస్థితిని వివరించారు. ఈలోగా, ఇండియా, పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రయత్నం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ కి పాకిస్తాన్ కృతజ్ఞతలు
"ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వం, చురుకైన పాత్రకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం మేము తీసుకున్న ఈ నిర్ణయానికి సహాయం చేసినందుకు అమెరికాకు పాకిస్తాన్ కృతజ్ఞతలు" అని షెహబాజ్ షరీఫ్ అన్నారు. దక్షిణాసియాలో శాంతికి విలువైన సహకారం అందించినందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.