
ప్రెగ్నెన్సీ ప్రభావం ప్రతి మహిళ శరీరంపై భిన్నంగా ఉంటుంది. చాలా మంది ఆడవారికి ఈ ప్రయాణం సులువైతే.. ఇంకొంతమంది ఆడవారికి ఇది కష్టంగా ఉంటుంది. తల్లి కావడంతో పాటుగా మీ బాధ్యతలు పెరుగుతాయి. దీని కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. గర్భధారణకు ముందు, తర్వాత మీరు మీ శరీరాన్ని అన్ని విధాలా సిద్ధం చేయాలి. అప్పుడే గర్భధారణ సమయంలో మీకు ఎలాంటి సమస్యలు రావు. గర్భధారణ కోసం మీ శరీరాన్ని ఎలా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భనిరోధక మందులు తీసుకోవద్దు
మీరు గర్భం దాల్చానుకుంటే గర్భనిరోధకాలను వాడటం మానేయండి. ముఖ్యంగా మీరు జనన నియంత్రణ మాత్రలను ఎట్టిపరిస్థితిలో తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం ఆపివేసిన వెంటనే మీరు గర్భందాల్చే అవకాశం ఉంది. వాస్తవానికి చాలా మంది మహిళలకు మాత్రలు తీసుకోవడం మానేసిన రెండు వారాల్లోనే రుతుక్రమం స్టార్ట్ అవుతుంది.
ఫోలిక్ యాసిడ్ తీసుకోండి
గర్భధారణ సమయంలో న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ఫోలిక్ యాసిడ్ లేదా ఫోలేట్ సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. విటమిన్లతో పాటుగా రోజుకు కనీసం 400 నుంచి 800 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి
శరీరాన్ని కదిలించడం లేదా వారానికి కనీసం నాలుగైదు సార్లైనా తేలికపాటి వ్యాయామాన్ని చేయండి. గర్భధారణకు మీ శరీరాన్ని సిద్ధం చేయడానికి ఇదొక్క గొప్ప మార్గం. ప్రతిరోజూ 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం చేయండి. దీంతో మీ శరీరం చురుగ్గా ఉంటుంది.
సమతుల్య ఆహారం తినండి
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తింటేనే మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తాజా ఆహారాన్నే తినడానికి ప్రయత్నించండి. సేంద్రీయ పండ్లు, కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి.
మల్టీవిటమిన్లను తీసుకోండి
ప్రెగ్నెన్సీ మీ శరీరంలోని పోషక నిల్వలను తగ్గిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మీ శరీరానికి అవసరమైన పోషణను పొందడానికి మల్టీ విటమిన్లు తీసుకోండి. గర్భధారణ సమయంలో పోషక లోపాలను నివారించడానికి ఇది బాగా సహాయపడుతుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా తీసుకునే ముందు వైద్యుడితో మాట్లాడండి.