
భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి రోజువారీ దినచర్యలో టీ ఒక భాగం అయ్యిందని చెప్పొచ్చు. టీ కొందరికి అమృతంలా ఉంటే, మరికొందరికి నెమ్మదిగా విషంలా మారుతుంది. మితంగా, తెలివిగా తాగితే టీ అమృతమే. కానీ అదే అలవాటుగా మారితే, నెమ్మదిగా శరీరానికి హాని కలిగిస్తుంది. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా, టీని ఎలా తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం..
టీలో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచడానికి, బద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఉండే పాలీఫెనాల్స్ శరీరాన్ని శుభ్రపరుస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అల్లం లేదా తులసి టీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్, అజీర్తి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
సాయంత్రం ఒక కప్పు టీ తాగితే, మనసు ఉల్లాసంగా మారుతుంది. మీకు ఏదైనా ఒత్తిడి ఉంటే అది తగ్గుతుంది.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ కూడా దెబ్బతింటుంది.
రోజుకు 3-4 కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, నిద్రకు కూడా భంగం కలుగుతుంది.
ఎక్కువ పంచదార, ఫుల్ క్రీమ్ పాలు కలిపిన టీ కేలరీలను పెంచుతుంది, కొవ్వును పేరుకుపోయేలా చేస్తుంది.
చాలా మందికి భోజనం చేసినప్పుడు లేదంటే, భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇది కూడా చాలా హానికరం.టీలో టానిన్లు ఉంటాయి, ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి, దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.