
బంగారమే కాదు.. వెండి ఆభరణాలు కూడా మనం అందంగా కనిపించేలా చేస్తాయి. ముఖ్యంగా ట్రెడీషనల్, మోడ్రన్ లుక్ లో కనిపించాలంటే ఇవి చాలా బెస్ట్ అనే చెప్పాలి. కానీ వెండి ఆభరణాలు కొన్ని రోజుల తర్వాత నల్లబడుతుంటాయి.
ఇదొక సర్వ సాధారణ సమస్య. వెండి ఆభరణాలు నల్లబడటానికి ఒక కారణం ఉంది. గాలిలోని తేమ, సల్ఫర్ వల్ల వెండిపై ఆక్సీకరణ పొర ఏర్పడి నల్లబడతాయి. కానీ మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో వెండిని తిరిగి కొత్తవాటిలా మెరిసేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బేకింగ్ సోడా, అల్యూమినియం ఫాయిల్
వెండి నగలను బేకింగ్ సోడాతో చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. నిజానికి ఇది వెండి ఆభరణాలను పాలిష్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అల్యూమినియం ఫాయిల్,బేకింగ్ సోడా మధ్య రసాయన ప్రతిచర్య జరిగి వెండి నుంచి నలుపును పోగొడుతుంది.
ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక లీటర్ గోరువెచ్చని నీళ్లు, అల్యూమినియం ఫాయిల్ అవసరమవుతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో వేడి నీళ్లు పోసి బేకింగ్ సోడా వేసి కలపండి.
అలాగే గిన్నె అడుగు భాగంలో అల్యూమినియం ఫాయిల్ ను పరచండి. ఇప్పుడు నల్లగా మారిన వెండి నగలను ఈ నీళ్లలో 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టండి. ఆ తర్వాత నగలను బయటకు తీసి శుభ్రమైన క్లాత్ తో తుడిస్తే నగలు కొత్తవాటిలా మెరిసిపోతాయి.
టూత్ పేస్ట్ మన దంతాలను క్లీన్ చేయడమే కాదు.. వెండి నగలను కొత్త వాటిలా పాలిష్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా ఒక వైట్ టూత్ పేస్ట్ ను తీసుకోండి.
అయితే జెల్ ను తీసుకోకూడదు. అలాగే మెత్తని బ్రష్ లేదా గుడ్డను తీసుకోండి. ఇప్పుడు వెండి నగలకు కొద్దిగా టూత్ పేస్ట్ ను పెట్టండి. ఆ తర్వాత మెత్తని బ్రష్ లేదా గుడ్డతో మెల్లిగా రుద్దండి. కానీ మీరు హార్డ్ బ్రష్ ను మాత్రం యూజ్ చేయకూడదు. దీనివల్ల నగలపై గీతలు పడతాయి.
నిమ్మకాయ, బేకింగ్ సోడా కూడా పాత వెండి ఆభరణాలను కొత్తవాటిలా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ వెండిపై పేరుకుపోయిన నలుపు పొరను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఇందుకోసం ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని అందులో సగం నిమ్మకాయ రసం వేసి కలపండి. ఈ పేస్ట్ నగలకు పెట్టి రెండు మూడు నిమిషాలు రుద్ది నీళ్లతో కడిగేయండి.
వెనిగర్, బేకింగ్ సోడా
వెనిగర్ వెండిని పాలిష్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది వెండికి పట్టిన నలుపును ఇట్టే తొలగిస్తుంది. ఇందుకోసం 1/2 కప్పు వైట్ వెనిగర్ ను రెండు టీస్పూన్ల బేకింగ్ సోడాలో వేసి బాగా కలపండి. దీనిలో వెండి నగలను వేసి 2-3 గంటలు నానబెట్టి శుభ్రమైన నీళ్లలో నానబెట్టండి.
అవును మనం తాగే కూల్ డ్రింక్స్ తో కూడా నల్లగా మారిన వెండి ఆభరణాలను ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఎలా అంటే కూల్ డ్రింక్స్ లో ఫాస్పోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది వెండికి పట్టిన నలుపును తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో కూల్ డ్రింక్స్ ను పోసి అందులో నగలను 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత మంచి నీళ్లతో నగలను శుభ్రం చేయండి.
వెండి నగలు ఎక్కువ కాలం మెరిసేలా ఉంచే చిట్కాలు
వెండి నగలను ఎప్పుడూ కూడా గాలి వెల్లని పెట్టెలోనే పెట్టాలి. అలాగే స్నానం చేసేటప్పుడు లేదా స్విమ్మింగ్ చేసేటప్పుడు నగలను వేసుకోకూడదు. అలాగే ఆభరణాలను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తుండాలి.