
కలబంద గుజ్జు మన చర్మానికి చాలా మంచిది. దీనిలో మన చర్మానికి హాని కలిగించే ఎలాంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి ఇది చర్మానికి మంచి చేయడమే కానీ చెడు చేయడం ఉండదు. అసలు కలబందను ముఖానికి పెట్టడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది
కలబంద జెల్ లో సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది మన చర్మాన్ని సున్నితంగా ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. దీంతో చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి. అలాగే ముఖంపై మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది. మీకు ఇప్పటికే మొటిమలు ఉంటే కలబంద జెల్ ను రెగ్యులర్ గా పెట్టండి. సమస్య తగ్గుతుంది. కలబంద జెల్ చర్మ ఎరుపును, చికాకును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కలబంద జెల్ చనిపోయిన చర్మకణాలను తొలగించి కొత్త చర్మం పెరగడానికి సహాయపడుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ గా, మృదువుగా చేస్తుంది
కలబంద జెల్ లో 99 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా సులువుగా, తొందరగా చర్మంలోకి శోషించబడుతుంది. ఇది మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పొడి చర్మం సమస్యను తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే ముఖంపై నల్ల మచ్చలను తొలగిస్తుంది. ఇందుకోసం ముఖాన్ని కడిగిన తర్వాత లేదా తలస్నానం చేసిన వెంటనే కొంచెం కలబంద జెల్ ను రాయండి. తర్వాత మాయిశ్చరైజర్ ను రాయాలి.
కలబంద జెల్ చిన్న వయసులో ముఖంపై ముడతలు ఏర్పడకుండా కాపాడుతుంది. ముఖానికి కలబంద జెల్ ను పెట్టడం వల్ల లోతైన ముడతలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది. ఇది మన చర్మం లోపలి నుంచి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు రావడాన్ని తగ్గిస్తుంది. మీకు ఇది వరకే ముడతలు గనుక ఉంటే వారానికి ఒకటి రెండు సార్లు ముడతలు పడిన దగ్గర కలబంద జెల్ ను అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేస్తే ముడతలు తగ్గుముఖం పడతాయి.
వాపును తగ్గించడానికి సహాయపడుతుంది
కలబంద జెల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల వాపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై కోతలు, కాలిన గాయాల వల్ల చర్మం మంట పెడుతుంది. ఇది తగ్గించడానికి కూడా కలబంద జెల్ సహాయపడుతుంది. నిపుణుల ప్రకారం.. కలబంద జెల్ సహజ నొప్పి నివారిణి. ఇది శరీరానికి గాయాల నుంచి ఓదార్పునిస్తుుంది. గాయాలు తొందరగా మానడాలనికి సహాయపడుతుంది.
చనిపోయిన చర్మ కణాలు, ఆయిల్, బ్యాక్టీరియా చర్మంపై పేరుకుపోవడం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. అయితే కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే కలబంద జెల్ మొటిమల వల్ల అయిన మచ్చలను, ఎరుపు, దురదను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
కాలిన గాయాలను తగ్గిస్తుంది
కలబందలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కాలిన గాయాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. చర్మంపై ఎక్కడైనా కాలినా, ఇతర గాయాలు అయినా దానిపై కలబంద జెల్ ను రాయండి. దీంతో చర్మం ఫాస్ట్ గా క్యూర్ అవుతుంది. అలాగే దురద, నొప్పి, ఎరుపును తగ్గించడానికి కూడా ఈ జెల్ సహాయపడుతుంది. అలాగే ఎండకు అయిన గాయలను కూడా కలబంద జెల్ నయం చేస్తుంది. ఇది చర్మాన్ని తేమగా చేసి గాయాలను త్వరగా మానడానికి సహాయపడుతుంది.
కలబంద గాయాలను నయం చేస్తుందనేది నిజమే. కానీ గాయం ఎక్కువగా ఉన్నా, బాగా తెరుచుకుని ఉన్నా దానికి కలబంద జెల్ ను రాయకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిక అలెర్జీ ఉన్నవారు కలబందను వాడితే అలెర్జీ వస్తుంది. మీకు ఈ జెల్ ను పెట్టుకున్నప్పుడు దద్దుర్లు వస్తే గనుక కలబంద జెల్ ను వాడటం మానేయండి.
అలాగే మీకు డయాబెటీస్ ఉండి షుగర్ నియంత్రణకు మందులు తీసుకుంటున్నట్టైతే కూడా నోటి ద్వారా కలబందను తీసుకోవడం మానేయండి. ఎందుకంటే ఇది మీ షుగర్ లెవెల్స్ ను మరింత తగ్గిస్తుంది. అలాగే కడుపు నొప్పి, విరేచనాలు, వికారం ఉన్నా కలబంద సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు. ఇది మీ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.
అలాగే తల్లిపాలిచ్చే ఆడవారు కూడా దీనిని ఉపయోగించడం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ బిడ్డలకు విరచేనాలు, ఇతర సమస్యలు వచ్చేలా చేస్తుంది. కలబంద లేటెక్స్, ఈ రసం 12 ఏండ్లకంటే తక్కువ వయస్సున్న పిల్లలకు మంచిది కాదు. కాబట్టి వాడకూడదు.