Weather Update: భారీ వర్షాల బీభత్సం.. ఏపీ, తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Published : Nov 04, 2026, 07:54 AM IST

Weather Update: బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బారత వాతావరణ శాఖ హెచ్చరికలతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేయగా, ఐటీ ఉద్యోగులకు ముందస్తు లాగౌట్ ప్రకటించారు.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, తుపాను ప్రభావంతో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం నెలకొంది.

నగరంలో ఉదయం ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, గరిష్ఠంగా 27 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం దాదాపు 72 శాతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం వేళ తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

25
తెలంగాణలో భారీ వర్షాలు.. వివిధ జిల్లాలకు అలర్ట్‌లు

మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) వర్ష హెచ్చరికలు జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు అత్యంత తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రెడ్ అలర్ట్ జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, ములుగు, హన్మకొండ, వరంగల్, యాదాద్రి, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. సూర్యాపేట, నల్గొండ ప్రాంతాల్లో ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

35
ఐటీ ఉద్యోగులకు ముందస్తు లాకౌట్.. సైబరాబాద్ పోలీసుల ఆదేశాలు

హైదరాబాద్‌లో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో నవంబర్ 3 నుండి 5 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల మేరకు, సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 4 గంటలకల్లా విడతలవారీగా లాగౌట్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

ప్రయాణాల్లో ప్రమాదాలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మధ్యాహ్నం 2 గంటల నుంచే స్టాగర్డ్ ఎర్లీ లాగౌట్లు ప్రారంభించాలని అభ్యర్థించారు. ఉద్యోగులు వీలైతే ఈ మూడు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు.

45
ఆంధ్రప్రదేశ్‌లో దంచికొడుతున్న వానలు

కోస్తాంధ్ర జిల్లాలలో వాతావరణం తీవ్రరూపం దాల్చింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం మెరుగై వానలోటు గణనీయంగా తగ్గిందని, భూగర్భజలాలు కూడా పెరిగాయని సీఎం చంద్రబాబు సమీక్షలో వెల్లడించారు.

ఆర్టీజీఎస్ సాంకేతికతను ఉపయోగించి తుపాను కదలికలను ముందుగానే పసిగట్టి, చివరి గ్రామం వరకు సమాచారం అందించామని తెలిపారు. విద్యుత్ సిబ్బంది, అధికార యంత్రాంగం రాత్రింబవళ్లు కష్టపడి ప్రాణ, ఆస్తినష్టాన్ని భారీగా తగ్గించాయని ప్రశంసించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారినందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్లరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

55
అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు

వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా తగిన చర్యలు చేపట్టడంతో పాటు అత్యవసర సహాయక బృందాలను రంగంలోకి దించారు. తుపాను సమయంలో రేషన్‌ దుకాణాల్లో నిత్యావసర సరుకులు నిల్వ ఉంచడంతో పాటు, వైద్య బృందాలు, 108, 104 సర్వీసులు, యాంటీ స్నేక్ వ్యాక్సిన్‌లను కూడా సిద్ధం చేశారు. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, ప్రభుత్వ వాతావరణ బులెటిన్లను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories