హీట్ పెంచుతోన్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు

Published : Oct 26, 2025, 06:00 PM IST

Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించగా, బీఆర్ఎస్ కూడా ప్రతివ్యూహాలు రచిస్తోంది.  

PREV
15
హోరాహోరీ పోరు, వ్యూహ ప్రతివ్యూహాలు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకోగా, నువ్వా నేనా అన్నట్లుగా రెండు పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఈ ఎన్నిక కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

25
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం..!

అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో జెండా ఎగురవేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఇందుకోసం విస్తృత కార్యాచరణను సిద్ధం చేసింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించగా, డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలకు పని విభజన చేసింది. పార్టీ శ్రేణులను ఏకం చేసి, ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ఉప ఎన్నిక ప్రచార బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది.

35
ఎంఐఎం మద్దతు..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం పార్టీ మద్దతు కాంగ్రెస్‌కు ప్రకటించింది. ఇది కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరుస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్ వంటి డివిజన్లలో ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ఎంఐఎం ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఎంఐఎం అగ్రనేతలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో మైనారిటీ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అండగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

45
బీఆర్ఎస్ ప్రచార శైలి..

మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్ స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. చాలా రోజులుగా ఫామ్‌హౌస్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంపై నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థిపై రౌడీ షీటర్ ఆరోపణలను ప్రచారంలోకి తీసుకువస్తోంది. ఈ ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీకి ఏ మేరకు ఓట్లు తెచ్చిపెడతాయోనన్న చర్చ జరుగుతోంది.

55
ఆరోపణలు, ప్రతి ఆరోపణలు

ఈ ఉప ఎన్నిక ప్రచారం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో వేడెక్కింది. బీఆర్ఎస్ చేస్తున్న రౌడీ షీటర్ ఆరోపణలకు కాంగ్రెస్ తీవ్రంగా కౌంటర్ ఇస్తోంది. బీఆర్ఎస్ చేస్తున్న ఆ వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా, బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతలను తమ పార్టీలో చేర్చుకుంటోందని, వాళ్లపై కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయన్న సంగతి కేసీఆర్ మర్చిపోయారా? అంటూ కాంగ్రెస్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇలా రెండు ప్రధాన పార్టీలు ఎవరి వ్యూహాన్ని వాళ్లు అమలు చేసే పనిలో ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories