Viral News: ప్రస్తుతం సోషల్ మీడియాలో కోవా బన్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేడారం జాతరలో కోవా బన్ విక్రయిస్తున్న ఓ సాధారణ వ్యాపారి చుట్టూ తిరిగిన సంఘటన సమాజానికి ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఓ చిరు వ్యాపారి మేడారం జాతరలో కేవలం పది రూపాయలకే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీర్చుకోవడం అతని లక్ష్యం. పెద్ద మూలధనం లేదు, పెద్ద వ్యాపారం లేదు. ఒక చిన్న స్టాల్, కొంత సరుకు ఇదే ఆయన పని.
24
యూట్యూబ్‌లో వీడియో
ఒక యూట్యూబ్ చానెల్ నిర్వాహకుడు ఆ వ్యాపారి వద్దకు వెళ్లి కోవా బన్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేశాడు. తక్కువ ధరకు అమ్ముతున్నావంటే ఏదో కల్తీ చేసివుంటావన్న ఆరోపణలతో ప్రశ్నలు సంధించాడు. ఆధార్ కార్డు చూపించాలని ఒత్తిడి చేయడం, గుంపుగా నిలబడి ప్రశ్నించడం వంటి చర్యలు వ్యాపారిని భయబ్రాంతులకు గురి చేశాయి. ఆ చిన్న వ్యాపారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జరిగిన ఈ సంఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
34
ఫైర్ అవుతోన్న నెటిజన్లు
వీడియో బయటకు వచ్చిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్రంగా స్పందించారు. పెద్ద పెద్ద బ్రాండ్లు డిస్కౌంట్లు ఇస్తే ప్రశ్నించని వారు, ఒక సామాన్యుడు తక్కువ ధరకే అమ్మితే ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆహార నాణ్యతపై సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలి. దేశంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నప్పుడు, వీధుల్లో విచారణ పేరుతో ఒక పేదవ్యాపారిని అవమానించడం సరైన పద్ధతి కాదని పలువురు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వేలాది మంది ఆ వ్యాపారికి మద్ధతు తెలిపారు.
సంఘటన తర్వాత అనేక మంది ముందుకు వచ్చి ఆ వ్యాపారికి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో మద్ధతు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అదే విధంగా ఆయనకు అండగా ఉంటూ ఫోన్ పే నెంబర్ ఇస్తూ ఆర్థికంగా సాయం చేయాలని పిలుపునిస్తున్నారు. మొత్తం మీద ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. ఇక ఆ చిరు వ్యాపారి సొంతూరులో కూడా ఆయనకు మద్ధతు లభిస్తోంది. గ్రామంలోని ప్రజలు అండగా నిలుస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు.