
హిందూ పురాణాల ప్రకారం, పార్వతీదేవి గణపతికి మొదట ఇచ్చిన ప్రసాదం లడ్డూనే. అప్పటి నుంచి ఆయనకు అది అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యంగా చెబుతుంటారు. గుండ్రంగా ఉండే లడ్డూ సంపూర్ణత, ఏకత్వం, ఐశ్వర్యం, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ప్రతి గణేశ పూజలో కనీసం ఒక లడ్డూనైనా సమర్పించడం ఆనవాయితీగా మారింది.
వినాయక చవితి వేడుకల ముగింపు సమయంలో విగ్రహ నిమజ్జనం ముందు గణపతిచేతిలో ఉండే లడ్డూను వేలం వేయడం ఒక సంప్రదాయం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ లడ్డూ దక్కించుకోవడం ద్వారా ఇంటికి స్వయంగా గణపతి బప్పా వచ్చినట్లే అనుకుంటారు. ఈ మహాప్రసాదం వల్ల వ్యాపార విజయాలు, విద్యలో ప్రగతి, వ్యవసాయంలో దిగుబడి, ఆరోగ్య సౌఖ్యం, కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని నమ్మకం.
కొంతమంది లడ్డూను గెలుచుకోవడం గర్వకారణంగా భావిస్తే, మరికొందరికి అదృష్ట సూచకం అని అనుకుంటారు. ఎవరికైతే దక్కుతుందో వారు దాన్ని దైవకృపగా భావించి కుటుంబ సభ్యులు లేదా బంధువులతో పంచుకుంటారు. కొందరికి ఇది తమ దానశీలతను, సంపదను, భక్తిని చాటుకునే అవకాశం కూడా అవుతుంది. అందుకే ఈ వేలంపాటల్లో పోటీ పెరిగిపోతుంది.
హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే శోభాయాత్రలతో పాటు లడ్డూ వేలం ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా బాలాపూర్ గణేశ్ లడ్డూ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. దశాబ్దాలుగా ఈ లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది.
* బాలాపూర్ లడ్డూను ఈ ఏడాది కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు గెలుచుకున్నారు. గతేడాది కంటే దాదాపు రూ.5 లక్షలు ఎక్కువ ధర పలికింది.
* రాజేంద్రనగర్ లడ్డూ: ఈసారి రికార్డు స్థాయిలో రూ.2.32 కోట్లకు అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ధరతో బాలాపూర్ లడ్డూ చరిత్రనే తిరగరాసినట్టైంది.
* మైహోమ్ భుజ గేటెడ్ కమ్యూనిటీ (రాయదుర్గం): ఖమ్మం జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేశ్ రూ.51.07 లక్షలకు లడ్డూను గెలుచుకున్నారు. గతేడాది కూడా ఆయనే రూ.29 లక్షలకు గెలుచుకున్నారు.
* కూకట్‌పల్లి బాలాజీనగర్: ఇక్కడ కాలనీ అధ్యక్షుడు సాధు ప్రతాప్‌రెడ్డి రూ.5.15 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. రెండో, మూడో లడ్డూలను వరుసగా రూ.2.10 లక్షలు, రూ.1.60 లక్షలకు ఇతరులు గెలుచుకున్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది.
* హత్నూరలో స్థానిక భక్తుడు రూ.9.1 లక్షలకు లడ్డూను గెలుచుకున్నారు.
* సంగారెడ్డిలో జగ్గారి నారాయణరెడ్డి రూ.3.51 లక్షలకు సొంతం చేసుకున్నారు.
* కామారెడ్డి జిల్లా పిట్లంలో జిత్తు పటేల్ రూ.5.11 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
* కంది మండలంలోని ఎద్దుమైలారం వద్ద వరకుమార్ రూ.3.35 లక్షలు పెట్టి గెలుచుకున్నారు.
* జహీరాబాద్ రంజోల్‌లో ప్రమోద్‌కుమార్ రెడ్డి రూ.2.05 లక్షలకు గెలుచుకున్నారు.
* వట్‌పల్లి మండలంలో లడ్డూ రూ.56 వేలకే దక్కింది.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో కూడా లడ్డూ వేలం ఉత్సాహంగా జరిగింది.
* హత్నూరలో స్థానిక భక్తుడు రూ.9.1 లక్షలకు లడ్డూను గెలుచుకున్నారు.
* సంగారెడ్డిలో జగ్గారి నారాయణరెడ్డి రూ.3.51 లక్షలకు సొంతం చేసుకున్నారు.
* కామారెడ్డి జిల్లా పిట్లంలో జిత్తు పటేల్ రూ.5.11 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.
* కంది మండలంలోని ఎద్దుమైలారం వద్ద వరకుమార్ రూ.3.35 లక్షలు పెట్టి గెలుచుకున్నారు.
* జహీరాబాద్ రంజోల్‌లో ప్రమోద్‌కుమార్ రెడ్డి రూ.2.05 లక్షలకు గెలుచుకున్నారు.
* వట్‌పల్లి మండలంలో లడ్డూ రూ.56 వేలకే దక్కింది.
భక్తి, సెంటిమెంట్‌తో పాటు సామాజిక గౌరవం కూడా లడ్డూ వేలం వెనుక ప్రధాన కారణం. లడ్డూను అధిక మొత్తంలో కొనుగోలు చేస్తే దేవుని కృపతో పాటు సమాజంలో గుర్తింపు కూడా లభిస్తుందని భావిస్తారు. చాలా మందికి ఇది ఒక రకంగా తమ స్థాయి, దాతృత్వం చూపించే అవకాశం. అందుకే ఎంత ఖర్చైనా సరే లడ్డూను సొంతం చేసుకోవాలని ఆశపడుతుంటారు. మొత్తం మీద వినాయక లడ్డూ ఒక తీపి పదార్థం మాత్రమే కాదు. అది భక్తి, విశ్వాసం, ఏకత్వానికి ప్రతీక. అందుకే ప్రతి సంవత్సరం లడ్డూ వేలంలో పోటీ పెరుగుతూ కోట్ల వరకు ధరలు చేరుకుంటున్నాయి. ఈ సంప్రదాయం గణపయ్యపై భక్తుల నమ్మకాన్ని, సమాజంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తోంది.