ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రతో సరిహద్దుల్లో కలిగి ఉంటుంది. అయితే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల విషయంలో తెలంగాణ మహారాష్ట్రకు మధ్య వివాదం కొనసాగుతోంది. బార్డర్ లోని 12 గ్రామాలు (పరందోళి, అంతాపూర్, ఎస్సాపూర్, కోట, పరస్వాడ, బోలాపటార్, పద్మావతి, ఇందిరా నగర్, మహారాజ్ గూడ, ముక్దంగూడ, లెండిజాల, గౌరి) తమవంటే తమవని ఇరురాష్ట్రాలు గొడవపడుతున్నాయి.
ఈ 12 గ్రామాల పంచాయతీ తాజాగా తెలంగాణ ఎన్నికల వేళ తెరపైకి వచ్చింది. పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీల పరిధిలోకి ఈ గ్రామాలు వస్తాయి... ఇక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ అధికారులు సిద్దమవుతున్నారు. మహారాష్ట్ర కూడా ఈ రెండు పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇలా తెలంగాణ నుండి ఒకరు, మహారాష్ట్ర నుండి ఇంకొకరు అంటే ఒకే పంచాయతీకి ఇద్దరు సర్పంచ్ లు ఉంటారన్నమాట.
కేవలం సర్పంచ్ లే కాదు ఉపసర్పంచ్ లు కూడా ఇద్దరు ఉంటారు. అలాగే ఒక్కో వార్డుకి ఇద్దరు మెంబర్లు ఉంటారు. ఇలా మొత్తంగా పరందోళి, అంతాపూర్ గ్రామాల్లో పాలకులకు డబుల్ ధమాకా అన్నమాట... తెలంగాణలో కాకుంటే మహారాష్ట్ర నుండి సర్పంచ్ కావచ్చు… మహారాష్ట్ర కాకుంటే తెలంగాణ నుండి కావచ్చు. ఇలా ఒకే పంచాయతీకి ఇద్దరు సర్పంచులుండటం ఆశ్చర్యకరమే కాదు పాలనాపరంగా ఇబ్బందికరం కూడా. అందుకే ఈ రెండు పంచాయతీల విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర ఓ ఏకాభిప్రాయానికి రావాలని ప్రజలు కోరుతున్నారు.