
Telangana Tourism : హైదరాబాద్... తెలంగాణ నడిబొడ్డున గల పురాతన నగరం. ఇక్కడి నుండి తెలంగాణలో ఏ ప్రాంతానికైనా ఒక్కరోజులో వెళ్లి తిరిగిరావచ్చు... ఇలా నగరవాసులు వీకెండ్ లో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టివచ్చేందుకు వీలుంటుంది. అందుకే ఒక్కరోజు సెలవు వచ్చిందంటే చాలు… చాలామంది నగరవాసులు పిల్లాపాపలతో అలా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు... నగరానికి దగ్గర్లోని దేవాలయాలు, ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతాలకు వెళుతుంటారు. గజిబిజిగా ఉండే నగరానికి దూరంగా దైవ చింతనలోనో, ప్రకృతి ఒడిలోనో గడుపుతారు. ఆ మధుర అనుభూతులతో సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు.
ఇలా హైదరాబాద్ ప్రజలు ఇలా ఉదయం వెళ్లి అలా సాయంత్రానికి ఇంటికి తిరిగివచ్చే టూరిస్ట్ ప్రాంతాలు తెలంగాణలో అనేకం ఉన్నాయి. కాబట్టి రేపు, ఎల్లుండి (జులై 12 శని, జులై 13 ఆదివారం) రెండ్రోజులు ఉద్యోగులకే కాదు స్కూల్, కాలేజీ పిల్లలకు కూడా సెలవే… ఈ రోజుల్లో ఇలాంటి ప్రాంతాలకు ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం వర్షాలు లేవు... వాతావరణం చల్లని గాలులతో ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి కుటుంబంతో లేదంటే స్నేహితులతో టూర్ కి వెళ్లి సరదాగా గడపొచ్చు.
కారులో కాదు బైక్ పై భార్యాభర్తలు, కుటుంబంతో అయితే బస్సులో సరదా ట్రిప్ కు వెళ్లిరావచ్చు… ఇందుకు తగినట్లు మంచి రవాణా వ్యవస్థ ఉంది. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల మంచి టూరిస్ట్ స్పాట్స్ ఏంటి? ఎలా వెళ్లాలి? అక్కడ ఏమేం చూడవచ్చు? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాలు :
కుతుబ్ షాహీలు, నిజాంల కాలంనుండి ఇప్పటివరకు రాజధానిగా వెలుగొందుతోంది హైదరాబాద్. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ నగరంలో అనేక చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. ఆనాటి రాజుల పాలనాకేంద్రం గోల్కొండ కోట చారిత్రక వైభవాన్ని తెలియజేస్తుంది. ఇక నగర నడిమధ్యలో ఠీవీగా నిలిచిన చార్మినార్ చూస్తూ, చుట్టుపక్కల ప్రాంతాల్లో షాపింగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక పిల్లలకు వినోదంతో పాటు విజ్ఞానం అందించే జూపార్క్, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నాయి. ఇలా హైదరాబాద్ లోని టూరిస్ట్ ప్రాంతాలన్ని దగ్గరదగ్గరే ఉన్నాయి... ఒక్కరోజులో వీటన్నింటిని చుట్టిరావచ్చు.
నగర శివారులో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సినిమా షూటింగ్ లు ఇక్కడ జరుగుతాయి. సినిమా సెట్టింగ్ లతో పాటు ప్రకృతి అందాలు, సరదా ఆటలను ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి వెళ్లవచ్చు. ఈ ఫిల్మ్ సిటీ సందర్శనను కూడా ఒక్కరోజులో పూర్తిచేయవచ్చు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ పురాతన ఆలయం హైదరాబాద్ కు సమీపంలో ఉంటుంది. పునర్మిర్మాణం తర్వాత యాదగిరిగుట్ట ఆలయం మరింత అద్భుతంగా మారింది. హైదరాబాద్ నుండి యాదగిరిగుట్టకు వెళ్లే మార్గం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. నగరవాసులు కుటుంబంతో కలిసి ఆద్యాత్మిక యాత్ర చేయాలనుకుంటే యాదగిరిగుట్ట వెళ్లవచ్చు... ఇలా ఉదయం వెళ్ళి స్వామివారిని దర్శించుకుని, మధ్యలో స్వర్ణగిరికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకోవచ్చు.
ఎంజిబిఎస్ బస్టాండ్ లేదా ఉప్పల్ నుండి యాదగిరిగుట్టకు ఆర్టిసి బస్సులు ఉంటాయి. నగరం నుండి ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి సొంత వాహనాలు లేనివారు కూడా యాదగిరిగుట్టు ఈజీగా వెళ్లిరావచ్చు.
కోరిన కోర్కెలు తీర్చే దేవుడు వెంకటేశ్వరస్వామి. ఆయన ఒక్క తిరుపతిలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో వెలిసారు. ఇలా హైదరాబాద్ శివారులోని చిల్కూరులో బాలాజీగా దర్శనం ఇస్తున్నారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే యువత ఈ స్వామివారిని దర్శించుకుంటే ఈజీగా వీసా వస్తుందనే నమ్మకం ఉంది... అందుకే ఈయనను వీసా దేవుడు అనికూడా అంటుంటారు. ఇక స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోర్కెలు తీరతాయని నమ్ముతారు.
ఈ చిల్కూరు ఆలయానికి సమీపంలోనే ఉస్మాన్ సాగర్ (గండిపేట) జలాశయం ఉంది. ఇక్కడ ఆహ్లాదకరమై వాతావరణం ఉంటుంది... అందుకే చిల్కూరుకు వెళ్లినవారు తప్పకుండా గండిపేటకు వెళుతుంటారు. ఇలా ఉదయం ఆద్యాత్మికత, మధ్యాహ్నం ప్రకృతి అందాలను వీక్షించి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోవచ్చు.
హైదరాబాద్ నగర శివారులోని వికారాబాద్ జిల్లాలోని అందమైన హిల్ స్టేషన్ అనంతగిరి. ఇది ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది... అందమైన అడవిమధ్యలో కాఫీతోటలు, సరస్సులు దాటుకుంటూ సాగే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి చాలామంది సాహసయాత్రకు వస్తుంటారు... ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఇలా కొండలపైకి చేరుకుని ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు.
ఇక అనంతగిరిలో పురాతన అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ పరిసరాలు కూడా అద్భుతంగా ఉంటాయి. హైదరాబాద్ కు 90 కిలోమీటర్ల దూరంలోని ఈ అనంతగిరికి ఉదయమే వెళితే అన్ని ప్రదేశాలను చుట్టి సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకోవచ్చు.
హైదరాబాద్ కు సమీపంలో మరో పురాతన పట్టణం కూడా ఉంది... అదే బీదర్. కర్ణాటకకు చెందిన ఈ పట్టణం తెలంగాణ బార్డర్ లో ఉంటుంది. ఇక్కడ కూడా హైదరాబాద్ లో మాదిరిగా ప్రాచీన కట్టడాలు, ప్రకృతి రమణీయమైన ప్రాంతాలున్నాయి.
ఇక్కడికి వెళ్లినవారు తప్పకుండా సందర్శించాల్సింది జర్ని నరసింహస్వామి దేవాలయం. భక్తులు సహజసిద్దంగా ఏర్పడిన 300 మీటర్ల గుహలో నీటిలోంచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా సాహసోపేతమైన భక్తి యాత్రలా ఉంటుంది. ఇక గురునానక్ సాహిబ్, బీదర్ కోటతో పాటు అనేక సందర్శనీయ ప్రదేశాలు ఈ కర్ణాటక పట్టణంలో ఉన్నారు.
బీదర్ కు వెళ్లేమార్గంలోనే తెలంగాణ బార్డర్ లో జహిరాబాద్ వస్తుంది. ఇక్కడ తెలంగాణ ఊటీగా పిలిచే గొట్టంగుట్ట అనే పర్యాటక ప్రాంతం ఉంటుంది. అందమైన అడవి మధ్యలో జలపాతాలతో వర్షాకాలంలో ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంతాలను కూడా హైదరాబాద్ నుండి ఒక్కరోజులో వెళ్లివచ్చేలా ఉంటాయి.