Telugu Language
Telugu Language : ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? అంటే ఇంగ్లీష్ అని టక్కున సమాధానం వస్తుంది. మరి భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది? దీనికీ టక్కున హింది అని సమాధానం వస్తుంది. ఉత్తర భారతదేశంలోనూ హింది ఎక్కువగా మాట్లాడుతుంటారు. మరి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మాట్లాడే భాష ఏది? అంటే ఎక్కువమంది వెంటనే సమాధానం చెప్పలేరు... ఆలోచనలో పడిపోతారు.
ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో వేరువేరు భాషలున్నా హిందీ మాట్లాడేవారే అధికం. కానీ దక్షిణాదిన ఒక్కో రాష్ట్రానికి ఒక్కో భాష. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తెలుగు మాట్లాడితే, తమిళనాడులో తమిళ, కర్ణాటకలో కన్నడ, కేరళలో మళయాళం మాతృ భాష. కాబట్టి దక్షిణాదిన అత్యధికమంది మాట్లాడే భాష ఏదో చాలామందికి తెలియదు. అందుకే టక్కున సమాధానం రాదు. కాబట్టి ఇప్పుడు దక్షిణాదిన అత్యధికమంది మాట్లాడే బాషేదో తెలుసుకుందాం.
భారతదేశంలో హిందీ ప్రధాన భాష అయితే దక్షిణాదిన తెలుగు అత్యధికులు మాట్లాడే భాష. కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు... ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. ఉపాధి కోసమో, ఉద్యోగాల కోసమే ఇతర రాష్ట్రాల్లో స్థిరపడినా తమ మాతృభాషను మరిచిపోలేదు... దాన్ని తమ తర్వాతి తరాలకు కూడా అందిస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తెలుగు మాట్లాడేవారు ఎక్కువగానే ఉన్నాయి.
Andhra Pradesh, Telangana
ఎక్కువమంది తెలుగు మాట్లాడే టాప్ 5 రాష్ట్రాలు :
'దేశ భాషలందు తెలుగు లెస్స' అని ఆనాడే శ్రీకృష్ణదేవరాయలు వంటి మహారాజు కొనియాడారు. దీన్నిబట్టే తెలుగు ఎంతటి గొప్పబాషో అర్థమవుతుంది. కానీ ఇలాంటి కమ్మని పలుకుల తెలుగును మాట్లాడేందుకు ప్రస్లుతం నామోషీగా ఫీలవుతున్నారు కొందరు తెలుగోళ్ళు. విదేశీభాష ఇంగ్లీష్ మోజులో పడి తెలుగు చులకనగా చూస్తున్నారు. కాలక్రమేణా తెలుగు ఖ్యాతి తగ్గిపోతోంది. కానీ ఇప్పటికయితే తెలుగు మాట్లాడేవారే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి.
1. ఆంధ్ర ప్రదేశ్ :
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనతో తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాయి... ఒకటి ఆంధ్ర ప్రదేశ్ కాగా మరొకటి తెలంగాణ. భూభాగం పరంగాను, జనాభా పరంగాను తెలంగాణ కంటే ఆంధ్ర ప్రదేశ్ పెద్దరాష్ట్రం. ఏపీ జనాభా 5 కోట్లకు పైనే ఉంటుంది... ఇందులో 89.2 శాతం మంది మాట్లాడేది తెలుగే. కాబట్టి దేశంలో అత్యధికంగా తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.
2. తెలంగాణ :
ఆంధ్ర ప్రదేశ్ తర్వాత తెలుగు భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ లో. మూడుకోట్లకు పైగా జనాభా కలిగిన తెలంగాణలో 75.8 శాతంమంది మాతృభాష తెలుగే. తర్వాత ఉర్దూ మాట్లాడేవారు రాష్ట్రంలో ఎక్కువగా ఉంటారు. అలాగే కొన్నిప్రాంతాల్లో లంబాడా, గోండ్ వంటి స్థానిక భాషలు మాట్లాడే ప్రజలు ఉన్నారు.
Highest Telugu Speaking Population States
3. కర్ణాటక :
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తర్వాత తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నది కర్ణాటకలో. తెలుగు రాష్ట్రాల నుండి వివిధ కారణాలతో కర్ణాటకకు వలసవెళ్లి అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నారు చాలామంది తెలుగుప్రజలు. చాలాకాలంగా అక్కడే ఉండటంతో వారి జనాభా పెరిగింది. ఇలా ప్రస్తుత కర్ణాటక జనాభాలో 5.9 శాతంమంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.
4. తమిళనాడు :
తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న తమిళనాడులో కూడా తెలుగోళ్లు ఎక్కువగా కనిపిస్తారు. గతంలో మద్రాస్ రాష్ట్రంలో కలిసుండటంవల్లనో లేక ఆ తర్వాత జరిగిన వలసల వల్లనో తమిళనాడులో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ రాష్ట్రం జనాభా 7 కోట్లకు పైనే... ఇందులో 5.8 శాతంమంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.
5. అండమార్ & నికోబార్ :
అండమాన్ & నికోబార్ అనేది భారతదేశం బయట సముద్రంలో విసిరివేయబడినట్లు ఉండే ద్వీపాల సముదాయం. ఇక్కడ జనాభా చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో తెలుగువారు అధికంగా ఉన్నారు. ఈ అండమాన్ & నికోబార్ దీవుల్లోని మొత్తం జనాభాలో 13.2 శాతంమంది తెలుగు భాషను మాట్లాడతారు.
ఇలా భారతదేశంలో ఇంకా చాలా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. చివరకు విదేశాల్లోనూ మన తెలుగోళ్ల సంఖ్య అధికమే. మొత్తంగా భారతదేశంలో తెలుగు భాషను మాట్లాడేవారు 8 కోట్లకు పైగా ఉంటారని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా లెక్కేస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.