Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే

Published : May 18, 2026, 10:10 AM IST

Tirupati: క‌లియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, బడ్జెట్ భయంతో చాలా మంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటారు. కానీ, సరైన ప్రణాళిక ఉంటే ఒక వ్య‌క్తి కేవ‌లం రూ. వెయ్యి లోపే ట్రిప్ ప్లాన్ చేసుకోవ‌చ్చు.

PREV
15
త‌క్కువ ఖ‌ర్చుతో రైలు జ‌ర్నీ

హైదరాబాద్ నుండి తిరుపతికి బస్సు లేదా ఫ్లైట్‌లో వెళ్తే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ ప్రయాణానికి భారతీయ రైల్వే (Indian Railways) ఉత్తమమైన మార్గం. అందులోనూ జ‌న‌ర‌ల్ టికెట్‌తో వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లోని కాచీగూడ లేదా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతికి లేదా రేణిగుంటకు వెళ్లే రైళ్లలో 'జనరల్ కంపార్ట్‌మెంట్' (General Compartment) టికెట్ తీసుకోవాలి. ఉదాహరణకు కాచీగూడలో సాయంత్రం 5 గంటలకు అందుబాటులో ఉండే చెంగల్పట్టు ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో రేణిగుంట వరకు జనరల్ టికెట్ ధర కేవలం రూ. 200 మాత్రమే ఉంటుంది. ఇక హైద‌రాబాద్ నగ‌రంలోని ఎక్క‌డి నుంచైనా స్టేష‌న్‌కు రూ. 50తో చేరుకోవ‌చ్చు. రేణిగుంట చేరుకున్న తర్వాత అక్కడి నుండి తిరుపతికి మరో రూ. 30 టికెట్‌తో ప్యాసింజర్ రైలు లేదా లోకల్ బస్సులో సులభంగా చేరుకోవచ్చు.

25
తిరుపతిలో ఉచిత వసతులు – ఫ్రెష్ అప్, లాకర్ సదుపాయాలు

తిరుపతి చేరుకున్న తర్వాత హోటల్ రూమ్స్ కోసం వందల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తిరుపతి రైల్వే స్టేషన్ పక్కనే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి 'విష్ణునివాసం' కాంప్లెక్స్ ఉంటుంది. ఇక్కడికి వెళ్లి మీ ఆధార్ కార్డ్ చూపిస్తే ఉచితంగా లాకర్ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ లాకర్‌లో మీ లగేజీనిసురక్షితంగా దాచుకోవచ్చు. అక్కడే ఉన్న ఉచిత హాల్స్‌లో ఫ్రెష్ అప్ అవ్వడానికి, స్నానాలు చేయడానికి అన్ని వసతులు ఉంటాయి. దీనివల్ల వసతి కోసం రూపాయి కూడా ఖర్చు అవ్వదు.

35
తిరుమల కొండపైకి ప్రయాణం

తిరుపతి నుండి తిరుమల కొండపైకి వెళ్ళడానికి టిటిడి ఉచిత బస్సులను నడుపుతోంది. అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్లే ఈ ఉచిత బస్సుల్లో ప్రయాణించి నడక మార్గం ప్రారంభ ప్రాంతానికి చేరుకోవచ్చు. 'శ్రీవారి మెట్టు' మార్గం ద్వారా నడక ప్రారంభించడం ఉత్తమం. ఇక్కడి నుండి కొండపైకి చేరుకోవడానికి సుమారు గంట‌న్న‌ర నుంచి 2 గంటల సమయం పడుతుంది. తిరిగి వచ్చేటప్పుడు కొండపై నుండి కిందకు రావడానికి ఆర్టీసీ బస్సు ఎక్కితే రూ. 90 టికెట్ ధర ఉంటుంది.

45
శ్రీవారి దర్శనం – ఉచిత సర్వదర్శనం టోకెన్లు

ఎటువంటి ముంద‌స్తు టికెట్ (రూ. 300 టికెట్) లేకపోయినా, కొండపైకి చేరుకున్న తర్వాత నేరుగా 'ఉచిత సర్వదర్శనం' (ఉచిత దర్శనం) లైన్లలోకి ప్రవేశించవచ్చు. దర్శనం లైన్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ సిబ్బంది ఉచితంగా ఫొటోలు తీసుకుని ఒక స్లిప్/టోకెన్ ఇస్తారు. ఆ తర్వాత కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండాలి. సాధారణంగా రద్దీని బట్టి 6 గంటల వ్యవధిలో స్వామివారి అద్భుతమైన దర్శనం లభిస్తుంది. ఈ ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు టిటిడి వారు లడ్డూ టోకెన్‌ను కూడా ఉచితంగా ఇస్తారు. దీని ద్వారా స్వామివారి ప్రసాదాన్ని ఉచితంగా పొందవచ్చు. అయితే సీజ‌న్ టైమ్‌లో కాకుండా వీక్ డేస్‌లో ప్లాన్ చేసుకుంటే భ‌క్తులు కాస్త త‌క్కువ‌గా ఉంటారు.

55
భోజన వసతులు, తిరుగు ప్రయాణం

ఈ ట్రిప్‌లో భోజనం ఖర్చులను తగ్గించుకోవడానికి ఇంటి నుంచే బ‌య‌లుదేరే ముందు టిఫిన్ తెచ్చుకుంటే మంచిది. ఇంటి ఫుడ్ వల్ల హెల్తీగా ఉండటమే కాకుండా హోటల్ ఖర్చులు పూర్తిగా మిగులుతాయి. కొండపై కూడా టిటిడి వారి అన్నప్రసాదం కేంద్రంలో ఉచితంగా తృప్తిగా భోజనం చేయవచ్చు. లేదు అంటే ట్రైన్‌లో వ‌చ్చే ఫుడ్‌ను కొనుగోలు చేసినా రూ. 1000 లోపే మీ టూర్ కంప్లీట్ అవుతుంది. దర్శనం ముగిసిన తర్వాత కొండ కిందకు చేరుకుని, తిరుపతి లేదా రేణిగుంట నుంచి సికింద్రాబాద్/హైదరాబాద్‌కు జనరల్ టికెట్ (సుమారు రూ. 225) తీసుకుని సురక్షితంగా ఇంటికి చేరుకోవచ్చు.

గమనిక: ఇచ్చిన బడ్జెట్ పూర్తిగా సాధారణ/జనరల్ క్లాస్ ప్రయాణంతో పాటు ఉచిత సేవలను ఆధారంగా చేసుకుని అందించ‌డ‌మైంది. అత్యవసర ఖర్చుల కోసం మీ దగ్గర క‌చ్చితంగా డ‌బ్బు ఉంచుకోవాల‌ని మ‌ర్చిపోకండి.

Read more Photos on
click me!

Recommended Stories