Bandi Bhageerath : పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. హైడ్రామా నడుమ అతడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
బండి సంజయ్ కొడుకుకు జైలు శిక్ష? చర్లపల్లికి భగీరథ్.. అసలేం జరిగింది?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు వ్యవహారం ఒక కీలక మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా ఉన్న భగీరథ్‌ను శనివారం రాత్రి సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో హాజరపర్చగా, న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ అరెస్ట్ వెనుక శనివారం తెల్లవారుజాము నుంచే హైడ్రామా నడిచింది.
24
ఆపరేషన్ భగీరథ్.. చాలా ప్రాంతాల్లో పోలీసుల వేట
పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినా అక్కడ ఎలాంటి రిలీఫ్ దక్కలేదు. దీంతో పోలీసులు ఆపరేషన్ భగీరథ్ పేరుతో సీరియస్‌గా రంగంలోకి దిగారు.
అతడు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, అన్ని ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్, పుణే, బెంగళూరు నగరాల్లో ఏకంగా 14 స్పెషల్ టీమ్స్ గాలింపు చేపట్టాయి. బంజారాహిల్స్‌లోని బండి సంజయ్ నివాసంతో పాటు ఆయన బంధువులు, భగీరథ్ ఫ్రెండ్స్ ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేయడం సంచలనం సృష్టించింది.
34
ట్విస్టుల నడుమ లొంగుబాటా? అరెస్టా?
శనివారం రాత్రి ఈ కేసంతా ఒక పొలిటికల్ థ్రిల్లర్‌ను తలపించింది. రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కుమారుడిని లాయర్ల ద్వారా పోలీసులకు తానే అప్పగించానని చెప్పారు.
అయితే సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి మాత్రం నార్సింగి పోలీస్ అకాడమీ (టిఎస్ పిఎ) జంక్షన్ దగ్గర భగీరథ్‌ను తామే అరెస్ట్ చేశామని ప్రకటించారు. వైట్ హుడీ, మాస్క్ ధరించిన భగీరథ్.. ఇద్దరు లాయర్లతో కలిసి నాలుగు కార్ల కాన్వాయ్‌లో రాత్రి 9:05 గంటలకు పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా స్టేషన్ ముందు పోలీసులు భారీగా బారికేడ్లు వేసి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ కేసులో మైనర్ బాలిక ఐడెంటిటీని బయటపెడుతూ, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 14 మంది యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామర్లపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. మరో 27 మందిపై విచారణ జరుగుతోంది.
భగీరథ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. తమ క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదని, పూర్తి విచారణకు సహకరిస్తామని చెప్పారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.