Telangana: కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి విగ్రహం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ఓ విగ్రహం భక్తులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో నిర్మించిన పార్క్ గురువారం (ఈరోజు) ప్రారంభమైంది.
వేములవాడ ఆలయానికి ఆనుకుని ఉన్న గుడి చెరువు బండ్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. సుమారు 700 మీటర్ల పొడవున విస్తరించిన ఈ పార్క్‌లో పచ్చని మొక్కలు, అందమైన ల్యాండ్‌స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్లు, వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు ఏర్పాటు చేశారు. గుడి చెరువులో బోటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు మధ్యలో ఐలాండ్‌ను నిర్మించి, దానిపై 40 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఆదియోగి విగ్రహాన్ని పోలి ఉండడం విశేషం. అలాగే సప్తమాతృకల విగ్రహాలు, నటరాజ స్వరూపం, అంఫి థియేటర్, కేబుల్ స్టోన్ ఫ్లోరింగ్ వంటి అంశాలు పార్క్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.
25
ఎలా ప్రారంభమైంది ఈ ప్రాజెక్టు?
వేములవాడ ఆలయ పరిసర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (VTDA) ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.12 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2023లో అప్పటి మంత్రి కేటీఆర్, అప్పటి ఎమ్మెల్యే చల్మెడ రమేశ్‌బాబు శంకుస్థాపన చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వం మారడం వంటి కారణాలతో పనులు కొంతకాలం నెమ్మదించాయి. తర్వాత జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రత్యేక చొరవతో పనులు వేగం పుంజుకుని పూర్తయ్యాయి.
35
రూ.15.22 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
బండ్ పార్క్‌తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పూర్తి చేసిన మొత్తం రూ.15.22 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రులు ప్రారంభించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇదే సందర్భంగా రూ.1.65 కోట్లతో చేపట్టనున్న వేములవాడ బస్టాండ్ పునర్నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. కొత్త బస్టాండ్‌లో ప్రయాణికులకు అవసరమైన ఆధునిక సౌకర్యాలు, పచ్చదనం, ఆవరణ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
జిల్లాలోని రగుడు బైపాస్ జంక్షన్‌ను కూడా రూ.3.10 కోట్లతో సుందరీకరించారు. ఇందులో బీటీ రోడ్డు విస్తరణ, హైమాస్ట్ లైట్లు, గ్రీనరీ, రోడ్డు భద్రత చర్యలు చేపట్టారు. అదేవిధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా వస్త్ర తయారీ ప్రక్రియను వివరిస్తున్న నమూనాలను ఏర్పాటు చేశారు. ఇవి జిల్లాకు వచ్చే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే ప్రయాణికుల సౌకర్యార్థం మోడల్ బస్ షెల్టర్లను కూడా నిర్మించారు.
55
వేములవాడ పర్యాటక రంగానికి కొత్త ఊపు
బండ్ పార్క్ అందుబాటులోకి రావడంతో వేములవాడకు వచ్చే భక్తులు ఆలయ దర్శనంతో పాటు ప్రకృతి మధ్య ఆహ్లాదకరమైన సమయాన్ని గడిపే అవకాశం కలగనుంది. బోటింగ్, భారీ శివుడి విగ్రహం, ఫౌంటెన్లు, పచ్చని వాతావరణం వంటి ఆకర్షణలు కుటుంబాలతో వచ్చే పర్యాటకులను ఆకట్టుకునే అవకాశముంది. ఈ అభివృద్ధి పనుల వల్ల వేములవాడ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా కూడా మరింత గుర్తింపు పొందుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఎలా చేరుకోవాలి.?
హైదరాబాద్ నుంచి వేములవాడకు సుమారు 140 కి.మీల దూరం ఉంటుంది. ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. సిద్ధిపేట, సిరిసిల్ల మీదుగా వేములవాడ చేరుకోవచ్చు. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సుులు అందుబాటులో ఉంటాయి.