
School Holidays : రుతుపవనాలు పూర్తిస్థాయిలో యాక్టివ్ గా మారడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నారు. మరీముఖ్యంగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి... దీంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. వరదనీటితో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి... జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు... విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నారు.
ఇవాళ (జూలై 30, గురువారం) తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాల్లో పరిస్థితులను బట్టి విద్యాసంస్థల సెలవులపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా జగిత్యాల, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉండే మండలాలు, గ్రామాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఇలా ఈ వర్షాకాలంలో మొదటిసారి భారీ వానల కారణంగా సెలవులు వచ్చాయి.
ఇప్పటికే రాజధాని హైదరాబాద్ తో సహా తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేవలం 24 గంటల్లో 100, 200 మిల్లిమీటర్ల వర్షం కురిసిన ప్రాంతాలు కూడా ఉన్నాయి. అయితే అత్యంత భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే వర్షాల కారణంగా విద్యాసంస్థలకు మరికొన్నిరోజులు సెలవులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట.
జూలై 30 నుండి ఆగస్ట్ 1 వరకు అంటే ఈ మూడ్రోరోజులు వర్ష బీభత్సం కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇవాళ (గురువారం) ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అలాగే 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయిని... ఈ గాలివానల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తోంది. అందుకే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండలని సూచిస్తోంది.
ఇక నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో కూడా అతిభారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయట... వీటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మెదక్, సంగారెడ్డి, జనగాం, హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్. వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ భారీ వర్షాలు, 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది.
ఇలా వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు తప్పవని వాతావరణ హెచ్చరిస్తోంది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో వరదలు వచ్చేలా ఉన్నాయి... ఇంకో రెండ్రోజులు వర్షాలంటే పరిస్థితి దారుణంగా మారే అవకాశాలున్నాయి. కాబట్టి వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే జిల్లాల్లో శుక్ర, శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ్టి మాదిరిగానే ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి కలెక్టర్లు సెలవులపై నిర్ణయం తీసుకుంటారు.
ఆగస్ట్ 2 ఆదివారం కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. అయితే ఈ ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఉంటాయి. కేవలం సికింద్రాబాద్ ప్రజలే కాదు నగర నలుమూలల నుండి భక్తులు ఈ బోనాల వేడుకలకు హాజరవుతారు. డప్పు చప్పుళ్లు, తీన్మార్ డ్యాన్సులు, పోతురాజుల హల్ చల్ మధ్య అత్యంత వైభవంగా వేడుకలు జరుగుతాయి.. మహిళలు బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
అయితే బోనాల తర్వాతి రోజు అంటే ఆగస్ట్ 3 సోమవారం కూడా సికింద్రాబాద్ ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఈరోజు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో భవిష్యవాణి (రంగం) ఉంటుంది. ఇక ఇదేరోజు సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఇలా ఆదివారం మొదలయ్యే బోనాల వేడుకలు సోమవారం కూడా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సోమవారం కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి.
ఇవాళ (జూలై 30, గురువారం) పలు తెలంగాణ జిల్లాల్లో స్కూళ్లకు భారీ వర్షాలు కారణంగా సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సెలవులు ఆగస్ట్ 8న వచ్చే రెండో శనివారం సెలవుతో భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అంటే ఇవాళ సెలవున్న విద్యాసంస్థలకు ఆగస్ట్ 8న రెండో శనివారం సెలవు ఉండదన్నమాట. ఆగస్ట్ లో రెండో శనివారం సెలవు రద్దు అయ్యే విద్యాసంస్థలు వచ్చేవారం లాంగ్ వీకెండ్ ను మిస్ అవుతాయి.
ఈ ఆదివారం (ఆగస్ట్ 2న) సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగితే ఆ తర్వాతి ఆదివారం (ఆగస్ట్ 9న) హైదరాబాద్ బోనాలు జరుగుతాయి. ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు నగరంలోని అన్ని అమ్మవార్ల ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఆషాడమాసంలో వచ్చే చివరి ఆదివారం కావడంతో హైదరాబాద్ లోనే కాదు తెలంగాణవ్యాప్తంగా బోనాలు జరుపుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలు ఎంతో భక్తిశ్రద్దలతో బోనాల పండగ నేపథ్యంలో అధికారిక సెలవు ఉంటుంది. బోనాల తర్వాతిరోజు అంటే ఆగస్ట్ 10న తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవే. ఇలా ఆగస్ట్ 8,9,10 మూడ్రోజులు తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు వస్తున్నాయి… మరో లాంగ్ వీకెండ్ అన్నమాట.