Telangana: తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు.. జ‌పాన్‌తో కీల‌క ఒప్పందాలు

Published : Sep 08, 2026, 07:09 PM IST

Telangana: తెలంగాణ యువతను అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రపంచస్థాయి నైపుణ్యాలు, విదేశీ భాషలపై పట్టు సాధించేలా యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

PREV
14
జర్మనీ అనుభవంతో జపాన్‌పై దృష్టి

జర్మనీలో తెలంగాణ యువతకు భాషా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని టామ్‌కామ్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ విధానాలను మార్చుతున్నట్లు చెప్పారు. జపాన్ పర్యటనలో అక్కడి ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపామని వివరించారు. విదేశాల్లో ఉద్యోగం పొందాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు స్థానిక భాష, పని విధానం, క్రమశిక్షణ, సంస్కృతిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని ఈ పర్యటన ద్వారా మరింత స్పష్టమైందన్నారు. జర్మనీ తరహాలో జపాన్‌లోనూ తెలంగాణ యువతకు పెద్ద సంఖ్యలో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించడంతో ఈ పర్యటన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులతో పాటు టామ్‌కామ్ ప్రతినిధులు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి, ప్రిన్సిపల్‌ను కూడా ప్రతినిధి బృందంలో చేర్చినట్లు చెప్పారు.

24
జపాన్‌లో ఇంజినీర్ల నుంచి డ్రైవర్ల వరకు డిమాండ్

జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు రంగాల్లో మానవ వనరుల కొరత ఏర్పడుతోందని మంత్రి పేర్కొన్నారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్ వంటి విభాగాలతో పాటు డ్రైవింగ్ రంగంలోనూ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా బస్ డ్రైవర్లకు జపాన్‌లో భారీగా డిమాండ్ ఉందని తెలిపారు. దాదాపు 10 వేల మంది డ్రైవర్ల అవసరం ఉన్నట్లు పర్యటనలో తమకు సమాచారం అందిందన్నారు. ఈ అవకాశాలను తెలంగాణ యువత అందిపుచ్చుకునేలా డ్రైవింగ్ నైపుణ్యంతో పాటు జపనీస్ భాష, అక్కడి పని సంస్కృతిపై శిక్షణ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. విదేశీ ఉద్యోగానికి వెళ్లే యువత కేవలం వృత్తిపరమైన నైపుణ్యాలపైనే ఆధారపడకుండా ఆయా దేశాల విధానాలకు అనుగుణంగా తయారయ్యేలా ముందస్తు శిక్షణ అవసరమని మంత్రి స్పష్టం చేశారు.

34
యూనివర్సిటీ–పరిశ్రమ అనుసంధానంపై ప్రత్యేక దృష్టి

జపాన్‌లోని యూనివర్సిటీలను సందర్శించిన సందర్భంగా విద్యా సంస్థలు, పరిశ్రమల మధ్య ఉన్న బలమైన అనుసంధానం తమ దృష్టిని ఆకర్షించిందని వివేక్ వెంకటస్వామి తెలిపారు. పరిశ్రమలకు భవిష్యత్తులో ఎలాంటి నైపుణ్యాలు అవసరం? ఎలాంటి పరిశోధనలు జరగాలి? వంటి అంశాలపై విద్యా సంస్థలు ముందుగానే కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. విద్యార్థులు కోర్సు పూర్తయ్యే సమయానికి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిద్ధంగా ఉంటే అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలను పొందే అవకాశం పెరుగుతుందని చెప్పారు. హిరోషిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భాగస్వామ్యంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. విద్యార్థుల మార్పిడి, ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్, పరిశోధన, ఏఐ, ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, అధునాతన తయారీ వంటి రంగాల్లో సహకార అవకాశాలను పరిశీలించినట్లు వెల్లడించారు.

సెమీకండక్టర్లు, రోబోటిక్స్‌ నుంచి వ్యవసాయ సాంకేతికత వరకు

ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్లు, రోబోటిక్స్, ఆటోమేషన్, డిఫెన్స్ వంటి రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలోనూ ఈ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నందున భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత విద్యా విధానాన్ని కొనసాగిస్తూనే అదనంగా కొత్త స్కిల్ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. విద్యార్థులు తమ ఆసక్తి, కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్సులను ఎంచుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

జపాన్ పర్యటనలో సటాకే కార్పొరేషన్‌ను సందర్శించి ఆధునిక రైస్ ప్రాసెసింగ్ టెక్నాలజీని పరిశీలించినట్లు చెప్పారు. వరి ఎండబెట్టడం, నిల్వ చేయడం, మిల్లింగ్, సార్టింగ్ వంటి ప్రక్రియల్లో ఉపయోగించే సాంకేతికతను తెలంగాణలో అందుబాటులోకి తీసుకురావడంపై చర్చలు జరిపినట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, రైస్ ప్రాసెసింగ్ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

44
ఏటీసీల విస్తరణ.. టామ్‌కామ్‌కు రూ.90 కోట్ల కేటాయింపు

గతంలో అంతగా ప్రాధాన్యం లేని ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రాలుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు పనిచేస్తుండగా, మరో 54 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో సీఎన్‌సీ మెషిన్లు, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు రూ.2,000 స్టైపెండ్ అందించే చర్యలు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.

విదేశీ ఉపాధి అవకాశాలను సురక్షితంగా అందించేందుకు టామ్‌కామ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. ఈ బడ్జెట్‌లో సంస్థకు రూ.90 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భాషా శిక్షణ, కల్చర్ ఓరియంటేషన్, వీసా, పాస్‌పోర్ట్ తదితర అవసరాలకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు వివరించారు. విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడే నకిలీ ఏజెన్సీలను నమ్మవద్దని యువతను హెచ్చరించారు. ప్రభుత్వ స్థాయిలోనే విదేశీ సంస్థలు, యూనివర్సిటీలు, కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసి సురక్షితమైన మార్గంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

పాలిటెక్నిక్ భూములను విక్రయించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. అప్‌గ్రేడేషన్ పేరుతో భూములు అమ్ముతున్నారన్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. కొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే 250 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులు, సిబ్బందికి ప్రస్తుత విద్యా, ఉద్యోగ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

అలాగే పీఎం సేతు కార్యక్రమంలో తెలంగాణకు నాలుగు క్లస్టర్లు లభించడాన్ని రాష్ట్రం చేసిన ముందస్తు కృషికి ఫలితంగా మంత్రి అభివర్ణించారు. ప్రైవేట్ భాగస్వామ్యం, కేంద్ర నిధులతో కలిపి సుమారు రూ.40 కోట్లతో వాటిని ఆధునీకరించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories