
తెలంగాణ శాసనసభ సాక్షిగా సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నల్ల టీషర్టులు ధరించి, ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని తోసేసి, కాలర్లు పట్టుకుని, తీవ్ర పదజాలంతో దూషించారని ఖైరతాబాద్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎం. బాలస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలపై పంజాగుట్ట, ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల ప్రకారం ఈ కేసులను బుక్ చేశారు. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఆధారాలు, మీడియా విజువల్స్ ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసుల్లో పేర్కొన్న ప్రధాన సెక్షన్లు ఇవే..
• BNS సెక్షన్ 121(1): ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వహించకుండా అడ్డుకోవడానికి, తీవ్రమైన గాయం చేయడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించడం.
• BNS సెక్షన్ 132: విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించడం.
• BNS సెక్షన్ 74 & 79: మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం (మహిళా పోలీసుల పట్ల ప్రవర్తనపై).
• BNS సెక్షన్ 351 & 352: నేరపూరిత బెదిరింపులు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడం.
• BNS సెక్షన్ 353: సభలు, సమావేశాలు లేదా బహిరంగ ప్రాంతాల్లో గందరగోళం సృష్టించడం.
• BNS సెక్షన్ 3(5): పలువురు వ్యక్తులు కలిసి ఒకే ఉద్దేశంతో నేరానికి పాల్పడడం.
ఒకవేళ న్యాయస్థానంలో విచారణ జరిగి, ఈ విజువల్స్ ఆధారంగా ఆరోపణలు రుజువైతే, సదరు నాయకులకు చట్టపరంగా కఠినమైన పరిణామాలు ఎదురవుతాయి. ఆ వివరాలు గమనిస్తే..
1. జైలు శిక్షలు, జరిమానాలు
BNS 132, 121(1): విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసి, విధులను అడ్డుకున్నట్లు తేలితే 2 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది.
BNS 74 (మహిళా సిబ్బంది అవమానం): మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తేలితే 1 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు.
BNS 351 (బెదిరింపులు): తీవ్రమైన బెదిరింపులకు పాల్పడినట్లు నిరూపితమైతే మరో 2 ఏళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.
2. ఎమ్మెల్యే పదవులకు అనర్హత ముప్పు
o ప్రజా ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act, 1951) ప్రకారం, ఏదైనా క్రిమినల్ కేసులో ప్రజాప్రతినిధికి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే, వారు వెంటనే తమ సభ్యత్వాన్ని (MLA/MLC పదవిని) కోల్పోతారు. అంతేకాకుండా శిక్ష కాలం పూర్తయిన తర్వాత మరో 6 ఏళ్ల పాటు పోటీ చేయడానికి కూడా అనర్హులవుతారు.
మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, కులపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, బి. నవీన్ కుమార్ రెడ్డిలను సైఫాబాద్ పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేశారు. స్పీకర్ OSD పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో SC/ST (అట్రాసిటీ నిరోధక) చట్టం పరిధిలోని కీలక సెక్షన్లను చేర్చారు.
సభాధిపతిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడం, బహిరంగ ప్రదేశంలో కులాన్ని ఉద్దేశించి మాట్లాడారనే ఆరోపణలు ఉండటంతో SC/ST అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం కింద నమోదు అయ్యే నేరాలు నాన్-బెయిలబుల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీలను నాంపల్లి ఫస్ట్ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
బీఆర్ఎస్ నాయకులపై కేసుల నమోదుతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వం తమ నాయకులపై కక్షపూరితంగా పోలీసులు, అట్రాసిటీ కేసులను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని, పోలీసులను అవమానిస్తే సహించేది లేదని కాంగ్రెస్, ఇతర అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల వద్ద ఉన్న సీసీటీవీ డిజిటల్ సాక్ష్యాలు కోర్టులో ఎంతవరకు నిలుస్తాయి, ఈ లీగల్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.