
Telugu States Weather Updates : వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వానలు జోరందుకుంటాయని... అందుకు తగిన వాతావరణం ఏర్పడినట్లు వెల్లడించారు. తెలంగాణలో భారీ నుండి అతిభారీ వర్షాలు... ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో నేడు జోరువానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు... కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షసూచనలు ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది వాతావరణ శాఖ.
నేడు(సోమవారం) తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కమ్మేసి అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని... వాతావరణం చల్లగా ఉంటుంటని ప్రకటించింది.
రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తంగా ఈరోజు నగరవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందట. సాయంత్రం సమయంలో చిరుజల్లులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలో దాదాపు ఈ వారమంతా (జులై 7 నుండి 10వరకు) భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ నుండి అతిభారీ వర్షాలతో మొదలై ఎడతెరిపి లేకుండా కుండపోత వానలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ దెబ్బకు వానలు లేని లోటు తీరిపోతుందని ప్రజలు భావిస్తున్నారు.
ఇవాళ మొదలయ్యే వర్షాలు రేపు (మంగళవారం) మరింత జోరందుకోన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. ఈరోజు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి లో కూడా మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే జోరువానలు కురుస్తున్నాయి... జులై 10న కూడా ఈ జిల్లాలో భారీ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయట. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఈ నాలుగురోజులు భారీ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిచోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశాలున్నాయని... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు వర్షసమయంలో జాగ్రత్తగా ఉండాలని... చెట్ల కింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండకూడదని సూచిస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్ లో ఇవాళ(గురువారం) మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడిచింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందట... గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అయితే తెలంగాణలో మాదిరి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఏపీలో లేవని వాతావరణ శాఖ సూచనలకు బట్టి తెలుస్తోంది.
ఇవాళ (సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, అనంతపుర, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది కాబట్టి ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండటం మంచిది.