Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకుడు జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆయన ఎమన్నారంటే.?
మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జగదీశ్‌రెడ్డి పలు రాజకీయ అంశాలపై స్పందించారు. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లోకి తిరిగి రావాలని భావిస్తున్న నేతల విషయంలో పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరి విషయంలో మాత్రమే వారి రాజకీయ ప్రవర్తన, వ్యవహారశైలిని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే కొండా సురేఖ విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపు ఉండదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమెను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కనీసం తెలంగాణ భవన్ గేటు వరకు కూడా ఆమెను రానివ్వబోమంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
24
రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ అదే వైఖరి
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ బీఆర్‌ఎస్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. రాజగోపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నా పార్టీ ఆయనను చేర్చుకోదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిన సమయంలోనే తమ పార్టీ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని గుర్తుచేశారు. అప్పుడే నిర్ణయం తీసుకున్న పార్టీ ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత వెనక్కి తగ్గే అవకాశం లేదనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.
34
ఎమ్మెల్యేల క్యారెక్టర్ ఆధారంగానే నిర్ణయం
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్‌ఎస్ తలుపులు పూర్తిగా మూసివేయలేదని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎవరు పడితే వారు పార్టీలోకి రావడానికి అవకాశం ఉండదన్నారు.
తిరిగి చేరాలనుకునే నేతల గత రాజకీయ వ్యవహారాలు, పార్టీ పట్ల వారి వైఖరి, వ్యక్తిగత రాజకీయ ప్రవర్తన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కేవలం రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా తిరిగి చేర్చుకునే విధానం బీఆర్‌ఎస్‌లో ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అది రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీస్తుందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి కోసం ఆయన పార్టీ మారితే డబ్బులకు అమ్ముడుపోయినట్టుగా భావించాల్సి వస్తుందని ఆరోపించారు. ఇదే సమయంలో గతంలో బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన నేతల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు నాయకులు అప్పట్లో పార్టీతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ అంశం కూడా రాజకీయంగా కీలకంగా మారనుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.