Sarpanch Powers : కొత్త సర్పంచ్ లూ.. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసా?

Published : Dec 19, 2025, 01:31 PM IST

Telangana Panchayat Elections 2025 : తెలంగాణలోని అన్ని పంచాయతీలకు ఎన్నికలు ముగిశాయి… కొత్త పాలకవర్గాలు కొలువయ్యాయి. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ఏం చేయాలి? ఏం చేయకూడదు? 

PREV
15
కొత్త సర్పంచ్ లు... ఈ విషయాలు తెలుసుకొండి

Telangana Panchayat Elections 2025 : తెలంగాణ గ్రామాల్లో గత పది పదిహేను రోజులుగా రాజకీయ హడావిడి సాగింది. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని శాసించే ఎమ్మెల్యే, పార్లమెంట్ నియోజకవర్గాన్ని పాలించే ఎంపీని ఎన్నకునేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి... కానీ ఈ ఎన్నికలను మించిన హంగామా పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో కనిపించింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపిలతో పాటు ఇతర పార్టీల సపోర్టర్స్, ఇండిపెండెట్స్ గ్రామాన్ని పాలించేందుకు ఆసక్తి చూపించారు... దీంతో గట్టిపోటీ ఏర్పడింది. నామినేషన్లు, ప్రచారం, పోలింగ్, ఫలితాల వెల్లడి.... ఇలా పంచాయతీ ఎన్నికల తతంగమంతా ముగిసింది.

తెలంగాణలో మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చాలామంది యువతీయువకులు ఈ ఎన్నికల ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు... సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రజాభిమాన్ని పొందినవారు పాలనతోనూ మెప్పించాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి... ఇందుకోసం ముందుగా సర్పంచ్ గా ఏం చేయాలి... ఏం చేయకూడదు? అనేది తెలుసుకోవాలి. అందుకే గ్రామ పంచాయతి విధులు, సర్పంచ్ పవర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
సర్పంచ్... ఇంత గొప్ప పదవా?

దేశానికి పల్లెటూర్లే పట్టుకొమ్మలు అంటుంటారు... దీన్నిబట్టే గ్రామపాలన ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గ్రామాల్లో సుపరిపాలన అందించేందుకు భారతీయులు ఏర్పాటుచేసుకున్న వ్యవస్థే పంచాయతీరాజ్. పంచాయతీలకు ప్రత్యేక పద్దతిలో ఎన్నికలు నిర్వహిస్తారు... స్థానిక ప్రజల మెజారిటీ నిర్ణయంమేరకు పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఇలా గ్రామ పాలన కోసం ఏర్పాటైన టీంకు సారథ్యం వహించేవారినే సర్పంచ్ అంటారు. అంటే దేశానికి పీఎం, రాష్ట్రానికి సీఎం ఎలాగో గ్రామానికి సర్పంచ్ అలాగే.

గ్రామంలో ఏ పని కావాలన్నా ముందుగా సర్పంచ్ ను సంప్రదించాల్సిందే. ప్రభుత్వ పథకాల నుండి ప్రైవేట్ పంచాయితీల వరకు ప్రజాసేవలో మునిగిపోతుంటారు సర్పంచ్ లు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం, శాంతిభద్రతలు కాపాడటం, ప్రభుత్వ ఆస్తులు కాపాడటం... ఇలా కీలక వ్యవహరాలన్నీ గ్రామ ప్రథమ పౌరుడిగా చూసుకోవాల్సింది సర్పంచ్ లే. మొత్తంగా గ్రామ పాలనకు మూలస్తంభం ఈ సర్పంచ్ పదవి.

35
సర్పంచ్ పవర్స్...

మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో ఉండేది గ్రామ పంచాయతి... దీనికి సర్పంచ్ అనేవారు అధిపతిగా వ్యవహరిస్తారు. సర్పంచ్ లకు పాలనా వ్యవహారాల్లో సహకరించేందుకు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఉంటారు. అలాగే ప్రభుత్వ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ పంచాయతీ కార్యదర్శి ఉంటారు. ప్రజలచేత ప్రత్యక్షంగా ఎన్నికయ్యే గ్రామ సర్పంచ్ కు అనేక బాధ్యతలు ఉంటాయి.

1. గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడు సర్పంచే. వీళ్లు గ్రామ పంచాయతీ, గ్రామసభలకు అధ్యక్షత వహిస్తారు.

2. గ్రామ పంచాయితీ పరిధిలో పనిచేసే ఉద్యోగుల పనితీరును పర్యవేక్షిస్తుంటారు. ఉదా : పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ద్య కార్మికులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూసుకుంటారు.

3. పంచాయతీకి సంబంధించిన రికార్డులను పరిశీలించవచ్చు. అధికారులు ఏదైనా తప్పుచేసినట్లు గుర్తిస్తే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వవచ్చు. ప్రభుత్వ అధికారుల నుండి పంచాయతీకి సంబంధించిన ఎలాంటి వివరాలను అయినా పొందవచ్చు.

4. గ్రామసభలు, ఇతర సందర్భాల్లో పంచాయతీ చేసిన తీర్మానాలను అమలుచేసే బాధ్యత సర్పంచ్ దే.

5. గ్రామ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పనితీరును పరిశీలించవచ్చు. ఉద్యోగులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు.

6. ఎంపిటిసి ని కలుపుకుపోతూ గ్రామ పాలన సాగించాలి. మండల పరిషత్ సమావేశాలకు సర్పంచ్ శాశ్వత ఆహ్వానితుల హోదాలో హాజరుకావచ్చు.

7. పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల సంరక్షణ కూడా సర్పంచ్ బాధ్యతే.

8. తెలంగాణ గ్రామాల్లో పారిశుద్ద్య పనుల కోసం గత ప్రభుత్వం ట్రాక్టర్లు అందించింది. వాటి నిర్వహణ కూడా సర్పంచ్ చూసుకోవాలి.

45
సర్పంచ్ ఏం చేయకూడదు...?

సర్పంచ్ గా ప్రజలచేత ఎన్నికైనవారు కొన్ని విషయాల్లో అలసత్వం ప్రదర్శిస్తే పదవిని కోల్పోతారు. కాబట్టి ఐదేళ్ల పాటు అధికారంలో ఉండాలంటే కొత్త సర్పంచ్ లు జాగ్రత్తగా ఉండాలి.

1. అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడినట్లు తేలితే జిల్లా కలెక్టర్ సర్పంచ్ ను తొలగించవచ్చు. అవిశ్వాస తీర్మానం లేదా ఇతర ఏ మార్గాల్లోనూ సర్పంచ్ ను తొలగించలేరు.

2. గ్రామ పంచాయతీ ఆడిట్ ను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. అలా చేయకున్నా సర్పంచ్ పదవిని కోల్పోతారు.

3. నిర్ణీత సమయంలో గ్రామ సభ నిర్వహించకున్నా సర్పంచ్ పదవిని కోల్పోతారు.

4. ప్రభుత్వ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకున్నా సర్పంచ్ ను పదవిలోంచి తొలగించవచ్చు. సర్పంచ్ తీరుపై అధికారులు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు.

5. సర్పంచ్ పదవిని కోల్పోయినా, ఏదైనా కారణాలతో రాజీనామా చేసినవారు ఏడాది లేదా రెండేళ్లపాటు ఆ పదవికి పోటీ చేసేందకు అనర్హులు.

55
సర్పంచ్ లకు గౌరవవేతనం... ఎంతో తెలుసా?

గ్రామ ప్రజలకు సేవలందించే సర్పంచులకు ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తుంది. వీరికి గతంలో రూ.5000 శాలరీ ఉండగా 2021 లో కేసీఆర్ సర్కార్ రూ.6,500 పెంచింది. పదవీకాలంలో కొనసాగినన్ని రోజులు సర్పంచ్ లకు నెలనెలా ఈ జీతం లభిస్తుంది.

అయితే చాలాకాలంగా సర్పంచ్ ల గౌరవవేతనం పెంచాలనే డిమాండ్ ఉంది. గ్రామ పాలనలో కీలకపాత్ర పోషిస్తున్న సర్పంచ్ లకు మరింత గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని కోరుతున్నారు... ఇప్పుడు ఎన్నికైన కొత్త సర్పంచ్ కు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. మరి రేవంత్ ప్రభుత్వం సర్పంచ్ ల వేతనం పెంపుపై నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories