
Telangana Panchayat Elections : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకటి తర్వాత ఒకటి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల బిసి రిజర్వేషన్ల పెంచి ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినతర్వాత రాష్ట్ర హైకోర్టు తీర్పుతో ఆగిపోయాయి. ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు కూడా అలాంటి న్యాయపరమైన ఇబ్బందులే తలెత్తున్నాయి. తాజాగా రిజర్వేషన్ల వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఓ పంచాయతీ ఎన్నికపై స్టే విధించింది.
తెలంగాణ హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిలో మహబూబాబాద్ జిల్లా మహమూద్ పట్నం పంచాయతీ పిటిషన్ ఒకటి. రిజర్వేషన్ల కేటాయింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కొందరు గ్రామస్థులు కోర్టును ఆశ్రయించారు... వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ పంచాయతీ ఎన్నికపై స్టే ఇచ్చింది.
కేసముద్రం మండలం మహమూద్ పట్నం పంచాయతీలో ఎస్టీ ఓటర్లు కేవలం ఆరుగురే... వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే తాజా గ్రామపంచాయితీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు కేటాయించగా ఈ ఎస్టీ కుటుంబానికే గ్రామ సర్పంచ్, మూడు వార్డులు దక్కాయి. ఇదేమిటని ప్రశ్నించగా అధికారుల నుండి సమాధానం లేదు... దీంతో గ్రామానికి చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదన విన్న న్యాయస్థానం ఈ పంచాయతీ ఎన్నిక నిర్వహించకుండా అడ్డుకుంది.
విచారణ సమయంలో అధికారులపై న్యాయస్థానం సీరియస్ అయ్యింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు ఒక సర్పంచ్, మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారు? వీరి ఓట్లన్ని ఒకే వార్డులో ఉన్నాయి... మరి మిగతా రెండు వార్డుల సభ్యులను ఎలా ఎంపిక చేస్తారు..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.
మహమూద్ పట్నం గ్రామ పంచాయితీ పరిధిలో గతంలో పలు తండాలు ఉండేవి… దీంతో ఈ పంచాయతీ పరిధిలో ఎస్టి ఓట్లు ఎక్కువగా ఉండేవి. కానీ గత బిఆర్ఎస్ హయాంలో తండాలను ప్రత్యేక గ్రామ పంచాయితీలుగా చేశారు... కాబట్టి మహమూద్ పట్నం పంచాయతీలో ఎస్టీ ఓటర్లు తగ్గిపోయారు. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రస్తుత పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తుండటంతో రిజర్వేషన్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఆరుగురు ఓటర్లున్న ఎస్టీలకు ఏకంగా సర్పంచ్, మూడు వార్డులు రిజర్వ్ అయ్యాయి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అంశం కాక రేపుతోంది. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పుకుని ఇప్పుడు పంంచాయతీ ఎన్నికల్లో కేవలం 17 శాతం రిజర్వేషన్లనే బిసిలకు ఇచ్చారని ప్రతిపక్ష బిఆర్ఎస్ మండిపడుతోంది. ఇలా రాజకీయపరంగానే కాదు న్యాయపరంగానూ పంచాయతీ ఎన్నికలపై వివాదం సాగుతోంది.
కొన్ని జిల్లాల్లో బిసి రిజర్వేషన్ల తగ్గింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సంగారెడ్డి, కల్వకుర్తి వంటి జిల్లాల నుండి పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది... మరి న్యాయస్థానం వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇవాళ (నవంబర్ 27, గురువారం) ప్రారంభమయ్యింది. మూడ్రోజులు అంటే నవంబర్ 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 11 తేదీన మొదటి విడత పోలింగ్ జరిగి అదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాలు వెలువడతాయి.
రెండో విడత నామినేషన్లు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 14న పోలింగ్, ఓట్ల లెక్కింపు, పలితాల విడుదల జరుగుతుంది.
మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభమై డిసెంబర్ 5 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 17 పోలింగ్, ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి ఉంటుంది.
ఇలా మొత్తం మూడు విడతల్లో రాష్ట్రంలోని 31 జిల్లాల 564 మండలాల్లోని 12,728 పంచాయతీలు, 1,12,243 వార్డులకు ఎన్నికలు నిర్వహించనునుంది EC. బ్యాలట్ పద్దతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమీషన్ ప్రకటించింది.