Telangana: బతుకమ్మకు తెలంగాణలో మహిళలకు చీరల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న సమయానికి చీరలను అందించలేకపోయింది. కాగా తాజాగా ఈ చీరల పంపిణీకి సంబంధించి మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి సంవత్సరం రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ చీరలను “ఇందిరా మహిళా శక్తి చీరలు” పేరుతో అందించనున్నారు. పండుగల సమయంలో అందించే ఈ చీరల ద్వారా మహిళల్లో గౌరవ భావన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చూస్తోంది.
25
సిరిసిల్ల నేతన్నలతో సీతక్క చర్చలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చీరల తయారీదారులు, నేత కార్మికులతో మంత్రి సీతక్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేనేత రంగానికి మరిన్ని ఆర్డర్లు ఇవ్వడం ద్వారా 365 రోజులు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో కార్మికులు నెలకు సుమారు రూ.25 వేల వరకు ఆదాయం పొందుతున్నారని సీతక్క వివరించారు.
35
చీరల పంపిణీ ఎప్పుడంటే.?
ఈ ఏడాది చీరల పంపిణీ లేకపోవడంతో దీనిపై మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నవంబర్ 19న స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు ఇందిరా గాంధీ జయంతి కావడంతో, ఆమె జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులకు ఈ చీరలు అందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సీతక్క తెలిపారు.
మహిళా సంఘాల సభ్యుల మధ్య ఐక్యత, సమాన గౌరవ భావన పెంచేందుకు ఒకే రకమైన చీరలను అందించనున్నట్లు సీతక్క తెలిపారు. రాష్ట్రంలో సుమారు 63 లక్షల మహిళా సంఘాల సభ్యులకు చీరలు అందించనున్నారు. భవిష్యత్తులో బతుకమ్మ చీరల పంపిణీ విషయంపైనా నిర్ణయం తీసుకొని, ఆ చీరలను కూడా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు అందించే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
55
చేనేతకు కొత్త ఆర్డర్లు
ఇందిరమ్మ చీరల రెండో విడత ఆర్డర్ కూడా త్వరలోనే ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదన పంపుతున్నామని సీతక్క వెల్లడించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు.