Jubilee Hills Bypoll : ఎవరీ నవీన్ యాదవ్..? అజారుద్దిన్, అంజన్ కుమార్ యాదవ్ కంటే తోపా?

Published : Oct 09, 2025, 09:11 AM IST

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారయ్యారు. మాజీ ఎంపీలు, మాజీ మేయర్, సీనియర్లతో పోటీపడిమరీ అతడు ఈ సీటు దక్కించుకున్నారు. 

PREV
15
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు...

Jubilee Hills Bypoll : తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలయ్యింది. ఓవైపు స్థానిక సంస్థలు.. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడింది... దీంతో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని కూడా ప్రారంభించింది... ఈ విషయంలో అధికార కాంగ్రెస్ కాస్త వెనకబడిందనే చెప్పాలి. అభ్యర్థి ఎంపికలో తర్జనభర్జన పడిన కాంగ్రెస్ ఎట్టకేలకు నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది.

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ ను అభ్యర్థిగా నిర్ణయించినట్లు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో మాజీ ఎంపీలు అజారుద్దిన్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కాదని టికెట్ ఇచ్చారు... ఎవరీ నవీన్ యాదవ్? అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. కాబట్టి అతడి గురించి ఇక్కడ తెలుసుకుందాం.

25
నవీన్ యాదవ్ వ్యక్తిగత జీవితం

నవీన్ యాదవ్ ఓ సాధారణ కుటుంబంలో పుట్టిపెరిగి స్వయంకృషితో ఎదిగారు. తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ (సోషల్ వర్కర్) బాటలో నడుస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణలోని ప్రముఖ రియల్టర్ల సరసన చేరారు. ఇలా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. హైదరాబాద్ కు చెందిన రాజకీయ పార్టీ AIMIM (ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్) ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు.

35
నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం

నవీన్ యాదవ్ మజ్లీస్ పార్టీలో 2009 చేరి వివిధ హోదాల్లో పనిచేశారు. ఇలా రియల్ ఎస్టేట్ లో మాదిరిగానే రాజకీయాల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు… మజ్లిస్ పార్టీ పెద్దల కళ్లలో పడ్డారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నుండి నవీన్ ను బరిలోకి దింపింది మజ్లీస్. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు.

ఈ ఓటమి తర్వాత ఎంఐఎంలో నవీన్ యాదవ్ హవా తగ్గింది... దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అతడికి మరో అవకాశం ఇవ్వలేదు. అయినా అతడు వెనక్కి తగ్గలేదు... ఎంఐఎంకు రాజీనామా చేసిమరీ ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఏ పార్టీ మద్దతు లేకుండానే ఏకంగా 18,817 ఓట్లు సాధించి తన సత్తా ఏమిటో చూపించారు. ఈ ఎన్నికల్లోనూ మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.

ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీకి సిద్దమయ్యారు నవీన్ యాదవ్... నామినేషన్ కూడా వేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దిన్ అభ్యర్థన మేరకు నామినేషన్ ను వెనక్కి తీసుకుని కాంగ్రెస్ లో చేరారు. అప్పటినుండి కాంగ్రెస్ నాయకుడిగా జూబ్లీహిల్స్ ప్రజలకు సేవలందిస్తున్నారు.

45
హేమాహేమీలను కాదని నవీన్ యాదవ్ కు టికెట్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది... కానీ హైదరాబాద్ లో మాత్రం ఆ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇలా జూబ్లీహిల్స్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దిన్ బిఆర్ఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు... మాగంటి గోపినాథ్ హ్యాట్రిక్ విజయం సాధించారు. కానీ అనారోగ్య సమస్యలతో ఆయన ఇటీవల మరణించడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీకి కాంగ్రెస్ హేమాహేమీలు ఆసక్తి చూపించారు. గత ఎన్నికల్లో పోటీచేసిన మాజీ ఎంపీ అజారుద్దిన్ మరోసారి టికెట్ ఆశించారు. ఇక మరో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. అలాగే హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మరో నాయకుడు సీఎన్ రెడ్డి పేర్లు కూడా వినిపించాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో సీఎం రేవంత్ రెడ్డి, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లతో సుదీర్ఘ చర్చల అనంతరం నవీన్ యాదవ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

55
మాగంటి కుటుంబానికి బిఆర్ఎస్ అవకాశం

భారత రాష్ట్ర సమితి ఇప్పటికే జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు అవకాశం ఇచ్చింది. మాగంటి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం... ఆ కుటుంబానికి నియోజకవర్గ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉండటం బిఆర్ఎస్ కు కలిసివస్తుందని భావిస్తున్నారు. అలాగే మాగంటి మరణంలో ప్రజల్లో సానుభూతి ఉంది... ఇది కూడా తమ గెలుపుకు సహాయపడుతుందని బిఆర్ఎస్ భావిస్తోంది.

జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ సిట్టింగ్ సీటు... కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కాపాడుకోవాలని చూస్తోంది. అందుకోసమే ముందుగానే ఉపఎన్నికలపై ప్రత్యేక దృష్టిపెట్టారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పలుమార్లు ఆ నియోజకవర్గంలో పర్యటించి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అందరూ మాగంటి కుటుంబంవైపే మొగ్గు చూపడటంతో సునీతను అభ్యర్థిగా ప్రకటించారు.

Read more Photos on
click me!

Recommended Stories