Telangana: తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల విధానంలో పెద్ద మార్పులు రానున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఈ దిశగా అధికారులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ సమావేశమయ్యారు.
ప్రస్తుతం తెలంగాణలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) ద్వారా నిర్వహిస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో వచ్చిన మార్కులు, విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా కళాశాలల్లో సీట్లు కేటాయిస్తున్నారు. అయితే భవిష్యత్తులో ఈ విధానాన్ని మార్చి ప్రత్యేక ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా డిగ్రీ అడ్మిషన్లు ఇవ్వాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించే పద్ధతి పూర్తిగా మారే అవకాశం ఉంది. ముందుగా నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం, తర్వాత సబ్జెక్టుల వారీగా ప్రవేశ పరీక్ష నిర్వహించడం, చివరగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల కేటాయింపు జరగే విధానం ఉండవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
25
రాష్ట్రంలో దోస్త్ వ్యవస్థలో ఉన్న కళాశాలలు, సీట్ల పరిస్థితి
తెలంగాణలో ప్రస్తుతం 826 ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు దోస్త్ పరిధిలో ఉన్నాయి. వీటిలో కలిపి సుమారు 3.77 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రతీ సంవత్సరం ఈ సీట్లలో సగానికి కొంచెం ఎక్కువ మాత్రమే నిండుతున్నాయి. సుమారు 1.75 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతుండగా, మిగిలినవి ఖాళీగానే మిగులుతున్నాయి. కొన్ని కళాశాలల్లో పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. దాదాపు 70 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా చేరని పరిస్థితి ఉంది. అలాగే వందలాది కోర్సుల్లో ఒక్క సీటు కూడా భర్తీ కావడం లేదు. ఈ కారణంగా మొత్తం సీట్లలో దాదాపు 60 శాతం వరకు ఖాళీలు మిగిలిపోతున్నాయి.
35
నాన్ దోస్త్ కళాశాలల సమస్య ఎందుకు?
దోస్త్ వ్యవస్థకు వెలుపల సుమారు 58 కళాశాలలు స్వతంత్రంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో 12 ఎయిడెడ్ కళాశాలలు, 46 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో కలిపి 36,637 సీట్లు ఉన్నాయి. ఈ సీట్లను ఆయా కళాశాలలే స్వయంగా భర్తీ చేస్తుంటాయి. కొన్ని చోట్ల భారీ ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా దీనికి పూర్తి స్థాయి పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ భావిస్తోంది.
అధికారుల అభిప్రాయం ప్రకారం డిగ్రీ కోర్సులకు ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తే అన్ని కళాశాలలు ఒకే విధానంలోకి రావచ్చు. మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే నాన్ దోస్త్ కళాశాలలు కూడా దోస్త్ వ్యవస్థలో చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొంతమంది కళాశాలల ప్రతినిధులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లలో పారదర్శకత పెరగడం, ఫీజుల నియంత్రణ, విద్యార్థులకు సమాన అవకాశాలు అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
55
2027–28 విద్యా సంవత్సరంలో అమలు చేసే అవకాశం
ఈ మార్పులు వెంటనే అమల్లోకి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. విధివిధానాలు సిద్ధం చేయడానికి సమయం అవసరం కావడంతో ప్రస్తుతం జరుగబోయే అడ్మిషన్లు దోస్త్ ద్వారానే కొనసాగుతాయి. అయితే ప్రభుత్వం అనుమతి ఇస్తే 2027–28 విద్యా సంవత్సరానికి డిగ్రీ ఎంట్రెన్స్ టెస్ట్ అమలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యా విధానం (NEP) కూడా ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచిస్తోంది. ఇప్పటికే దేశంలోని అనేక యూనివర్సిటీల్లో CUET (Common University Entrance Test) స్కోర్ ఆధారంగా డిగ్రీ సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అదే తరహా వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.