ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు, DTCP, HMDA అధికారులకు రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. 22ఏ జాబితాలో ఉన్న ఆస్తికి సంబంధించి అవసరమైన అనుమతులు, యాజమాన్య పత్రాలు, రెవెన్యూ రికార్డులు, ఇతర సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన ఆస్తిదారులు తమ వద్ద ఉన్న పత్రాలతో సంబంధిత అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీ
22ఏ భూముల అంశంపై ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేనను కమిటీ చైర్‌పర్సన్‌గా నియమించింది. రాజీవ్‌గాంధీ హనుమంతు, సందీప్‌కుమార్ ఝా, సంబంధిత జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అసెంబ్లీలో 22ఏ భూముల అంశంపై చర్చ జరిగిన తర్వాత ఈ కమిటీ ఏర్పాటైంది. భూముల వ్యవహారాల్లో చోటుచేసుకున్న అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలను పరిశీలించడం దీని బాధ్యతల్లో ఒకటి. ఈ కమిటీ పరిధి కేవలం 22ఏ భూములకే పరిమితం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.