Airport: వరంగల్ మూమునూరులో ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఎయిర్‌పోర్టుకు పేరును సూచించాలని ప్రభుత్వం ప్రజలను కోరింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి ఏ పేరు పెట్టాలనే అంశంపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల నుంచి సూచనలు కోరారు. దీంతో రాణి రుద్రమదేవి, కాకతీయ, సమ్మక్క-సారలమ్మ, ప్రతాపరుద్ర, పీవీ నరసింహారావు, కాళోజీ నారాయణరావు తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. సినీ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కూడా రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పేర్లను సూచించారు. పలువురు రాణి రుద్రమదేవి పేరునే ప్రతిపాదించారు. ప్రస్తుతం ప్రభుత్వం రాణి రుద్రమదేవి పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
24
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు కొమురం భీం పేరు
ఆదిలాబాద్‌లో నిర్మించనున్న విమానాశ్రయానికి కొమురం భీం పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఆదివాసీ ఉద్యమ చరిత్రలో కొమురం భీంకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పేరును విమానాశ్రయానికి పెట్టే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పేర్లపై ప్రభుత్వం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మరోవైపు రెండు విమానాశ్రయాల నిర్మాణాన్ని వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తోంది. సెప్టెంబర్ 2న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమై మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై చర్చించారు. మామునూరు విమానాశ్రయానికి అవసరమైన భూసేకరణ పూర్తిచేసి అప్పగించినట్లు సీఎం కేంద్రానికి తెలిపారు.
34
తెలంగాణ సంస్కృతి కనిపించేలా డిజైన్
విమానాశ్రయాల పేర్లతో పాటు వాటి నిర్మాణ డిజైన్‌పైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత నిర్మాణాల డిజైన్లను పరిశీలించి, తెలంగాణ ప్రత్యేకత స్పష్టంగా కనిపించేలా ఉండాలని సూచించినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టు పూర్తయితే వరంగల్‌తో పాటు ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి విమాన కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వ్యాపార కార్యకలాపాలకు కూడా ఇది మౌలిక వసతిగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మామునూరు విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే కీలక నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభించింది. తాజాగా విడుదలైన టెండర్‌లో కొత్త డొమెస్టిక్ టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్-కమ్-టెక్నికల్ బ్లాక్, ఫైర్ స్టేషన్, ఈఅండ్‌ఎం వర్క్‌షాప్‌తో పాటు ఇతర అనుబంధ పనులు ఉన్నాయి. ఈ ప్యాకేజీ అంచనా విలువ రూ.213.59 కోట్లు. టెండర్ ప్రకారం బిడ్ల సమర్పణకు నవంబర్ 3, 2026 చివరి తేదీగా ఉంది. సెప్టెంబర్ 2న జరిగిన కేంద్ర-రాష్ట్ర స్థాయి సమావేశంలో మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్లను త్వరగా పూర్తి చేసి డిసెంబర్‌లో పనులు ప్రారంభించే అంశంపై చర్చ జరిగింది. దీంతో విమానాశ్రయ నిర్మాణం కార్యరూపం దాల్చే దిశగా అడుగులు వేగవంతమైనట్లు తెలుస్తోంది.