Skyroot Aerospace : హైదరాబాద్ స్కైరూట్ ఏరోస్పేస్ భారత తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్‌ను 2026 జనవరి నాటికి ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రతి మూడు నెలలకు ఒక ప్రయోగం లక్ష్యంగా ముందుకుసాగుతోంది.
భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన హైదరాబాద్ స్కైరూట్ ఏరోస్పేస్
భారత అంతరిక్ష ప్రయోగాలలో ఇప్పటి వరకు కీలక పాత్ర పోషించిన ఇస్రో (ISRO) మాత్రమే రాకెట్లను అంతరిక్షంలోకి పంపేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్, దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. వచ్చే మూడు నెలల్లో ప్రయోగం జరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ప్రయోగంతో దేశ ప్రైవేట్ స్పేస్ సెక్టార్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. స్కైరూట్ సంస్థలో మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు స్థాపకులుగా ఉన్నారు.
25
జనవరి 2026 నాటికి పూర్తి స్థాయి కమర్షియల్ మిషన్
స్కైరూట్ ఏరోస్పేస్ తన తొలి పూర్తి స్థాయి శాటిలైట్ మిషన్‌ను 2026 జనవరి నాటికి అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనితో టెస్టింగ్ దశ నుండి వాణిజ్య కార్యక్రమాల దిశగా పెద్ద అడుగు వేయనుంది. చిన్న ఉపగ్రహాలను చెల్లింపు ఆధారంగా కక్ష్యలోకి పంపడం సంస్థ ప్రధాన లక్ష్యం.
2022 నవంబరులో స్కైరూట్ విక్రమ్-ఎస్ అనే ఉపకక్ష్య రాకెట్‌ను ప్రయోగించి భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంగా చరిత్ర సృష్టించింది.
35
నిధులు, పెట్టుబడులు, వ్యాపార ప్రణాళికలు
హైదరాబాద్ కేంద్రంగా ముందుకు సాగుతున్న స్కైరూట్ ఏరోస్పేస్.. భారత అంతరిక్ష రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి సిద్ధమవుతోంది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్, జీఐసీ వంటి పెట్టుబడిదారుల మద్దతుతో స్కైరూట్ ఇప్పటివరకు USD 95.5 మిలియన్ (రూ. 850 కోట్లు) సమీకరించింది.
స్కైరూట్ సీఈఓ పవన్ చందన ప్రకారం.. “ఒక రాకెట్ నిర్మించేందుకు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు సమయం పడుతుంది. దీని ఖర్చు సుమారు 2–3 మిలియన్ డాలర్లు. ఒక్కో ప్రయోగం ద్వారా సుమారు 5 మిలియన్ డాలర్ల ఆదాయం పొందవచ్చు.” ఈ సంస్థ 2026లో ప్రతి మూడు నెలలకు ఒక ప్రయోగం, 2027 నుండి ప్రతి నెల ప్రయోగం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
విక్రమ్-1 రాకెట్ మొదటి దశలో ఉపయోగించే KALAM-1200 మోటార్ స్థిర పరీక్షను స్కైరూట్, ISRO కలిసి విజయవంతంగా పూర్తి చేశాయి. ఈ మోటార్ పొడువు 11 మీటర్లు, వ్యాసం 1.7 మీటర్లు, ప్రొపెల్లెంట్ 30 టన్నులు, థ్రస్ట్ 1200 కిలోన్యూటన్స్ గా ఉన్నాయి.
KALAM-1200 మోటార్ దేశ ప్రైవేట్ రంగంలో రూపొందించిన అతి పెద్ద సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ స్టేజ్‌గా గుర్తింపు పొందింది. దాదాపు 110 సెకండ్ల స్థిర పరీక్షలో అనుకున్న విధంగా పనితీరుతో ముందుకు సాగింది. దీంతో విక్రమ్-1 తొలి కక్ష్య ప్రయోగానికి మరింత దగ్గరవుతోంది.
55
భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో వేగవంతమైన పెరుగుదల
ప్రస్తుతం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో 200కి పైగా స్టార్టప్స్ ఉన్నాయి. అంతరిక్ష విభాగం అంచనా ప్రకారం, 2033 నాటికి ఈ రంగం విలువ USD 44 బిలియన్ దాటే అవకాశముంది. స్కైరూట్ విజయంతో భారత ఉపగ్రహ ప్రయోగ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ క్లయింట్ల కోసం కొత్త అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగం భాగస్వామ్యం పెరుగుదల ఉంటుంది. కమర్షియల్ స్పేస్ ప్రయోగాల్లో భారత్‌కు కొత్త విప్లవం మొదలవుతుంది.