తెలంగాణ వైపు దూసుకొస్తున్న మొంథా.. ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వ‌ర్షాలు, అల‌ర్ట్‌గా ఉండండి

Published : Oct 29, 2025, 02:21 PM IST

Cyclone montha: ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటిన తీవ్ర తుఫాన్‌ “మోంథా” ఇప్పుడు బలహీనపడుతూ తెలంగాణ వైపు కదులుతోంది. దీంతో తెలంగాణ‌లో ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిస్తోంది. 

PREV
15
తెలంగాణలో మోంథా ప్రభావం

వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం మొంథా తుఫాన్‌ భద్రాచలం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం నుండి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర-వాయువ్య దిశలో కదులుతూ, రాబోయే ఆరు గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో తెలంగాణ అంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల‌, జగిత్యాల‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సిద్ధిపేట, సూర్యాపేట, భువనగిరి, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ అమల్లో ఉంది.

25
రైళ్ల రాకపోకలకు అంతరాయం

తుఫాన్‌ తీవ్రత కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఆగిపోగా, డోర్నకల్‌ స్టేషన్‌ నీటమునిగింది. గోల్కొండ‌, షిరిడి‌, ఇంటర్‌సిటీ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

35
ప్రభుత్వ హై అలర్ట్‌

తుఫాన్‌ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి అన్ని శాఖలను సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రమాద సూచనలు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు.

45
మానేర్ డ్యామ్‌లో పెరిగిన నీటిమ‌ట్టం

లోయర్‌ మానేరు డ్యామ్‌లో వర్షాల ప్రభావంతో నీటి మట్టం పెరిగింది. అధికారులు రెండు గేట్లు ఎత్తి 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండిపోయిందని, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంత్రుల సమీక్ష

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించారు. రెవెన్యూ, విద్యుత్‌, పంచాయతీ రాజ్‌, విపత్తు నిర్వహణ శాఖలతో సమావేశమై ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు, చెరువులు, కల్వర్టుల వద్ద పోలీసులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.

55
వాతావరణ శాఖ హెచ్చరిక

రాబోయే 24 గంటల్లో అదిలాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల‌, కామారెడ్డి, వరంగల్‌, యాదాద్రి, మెదక్‌, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో 14 జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ అలర్ట్‌ కూడా జారీ అయింది. మొత్తం మీద మోంథా తుఫాన్‌ తీవ్రత తగ్గినా దాని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలు తప్పక పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories