Telangana Cabinet Expansion : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ తెలంగాణ కేబినెట్ విస్తరణకు సిద్దమయ్యింది రేవంత్ సర్కార్. మైనారిటీ కోటాలో టీమిండియా మాజీ కెప్టెన్ ను ఎమ్మెల్యే కాకుండానే మంత్రిని చేస్తున్నారు. ఆయన ఎవరో తెలుసా?
Mohammad Azharuddin : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో గెలిచితీరాలన్న పట్టుదలతో ఉన్న అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దిన్ కు తన కేబినెట్ లోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దమయ్యారు. అదిష్టానాన్ని ఒప్పించి మరీ అజారుద్దిన్ ను మంత్రిని చేస్తున్నారట సీఎం.
ఇప్పటికే అజారుద్దిన్ కు మంత్రిపదవి ఖాయం అయ్యిందని... ఎల్లుండి (అక్టోబర్ 31, శుక్రవారం) ప్రయాణస్వీకారానికి చకచకా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ కు ప్రభుత్వం సమాచారం అందించిందట. గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీని చేయనన్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది... ఇప్పుడు ఏకంగా మంత్రిని కూడా చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని అజారుద్దిన్ కలిశారు… దీంతో ఆయనకు మంత్రిపదవి ఖాయమేనని ఓ క్లారిటీ వచ్చేసింది.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దిన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ముందుగా అతడికే ఈ ఉపఎన్నికలో అవకాశం ఇవ్వాలని భావించింది కాంగ్రెస్... కానీ అనేక సమీకరణలను పరిశీలించాక యువ నాయకుడు నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ బరిలో దింపింది. అలాగే అజారుద్దిన్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చి శాసన మండలికి పంపించే ఏర్పాటు చేసింది.
35
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమేనా..?
అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మైనారిటీ ఓటర్లు పలితాన్ని ప్రభావితం చేసేస్థాయిలో ఉన్నారు... ఈ క్రమంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకే అజారుద్దిన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు ప్రతిసారి మైనారిటీలను రేవంత్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని... ఇందుకు మంత్రివర్గంలో ఒక్క మైనారిటీ లేకపోవడమే నిదర్శనమని బిఆర్ఎస్ పదేపదే ప్రచారం చేస్తోంది. అజారుద్దిన్ కు మంత్రిపదవి ద్వారా బిఆర్ఎస్ నేతల నోరు మూయించాలన్నది సీఎం ప్లాన్ గా తెలుస్తోంది. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అజారుద్దిన్ ను మంత్రిమండలిలోకి తీసుకోవడం ద్వారా ఇటు ప్రభుత్వానికి, అటు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని భావిస్తున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దిన్ పక్కా హైదరబాదీ. క్రికెటర్ గా టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదిగిన ఆయన రిటైర్ అయ్యాక రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరారు. క్రికెటర్ గా జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉండటంతో అతడిని ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేయించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మొదటిసారి లోక్ సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2014లో రాజస్థాన్ లోని టోంక్ లోక్ సభ స్థానంలో పోటీచేయగా ఓటమిపాలయ్యారు. దీంతో జాతీయ రాజకీయాలకు దూరమైన అజారుద్దిన్ తెలంగాణ పాలిటిక్స్ పై దృష్టిపెట్టారు.
55
అజారుద్దిన్ ది అదృష్టమే
2023 లో కాంగ్రెస్ పార్టీ తరపున జూబ్లిహిల్స్ అసెంబ్లీకి పోటీచేశారు అజారుద్దిన్... కానీ బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో ఓడిపోయారు. అయితే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉపఎన్నికలు వచ్చాయి... ఈ ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్దమైనా అజారుద్దిన్ కు సీటు దక్కలేదు.
అయితే రొట్టెవిరిగి నేతిలో పడ్డట్లుగా ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం దక్కకున్నా ఎన్నికలు లేకుండా ఎమ్మెల్సీ పదవి, ఇప్పుడు ఏకంగా మంత్రిమండలిలో చోటు దక్కుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు ఏకంగా సీఎంపైనే తిరుగుబాటు చేస్తున్నా మంత్రిపదవి దక్కడంలేదు... కానీ అజారుద్దిన్ కు ఇంత ఈజీగా ఈ పదవి దక్కడం అదృష్టమే అంటున్నారు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తున్నవారు.