
సనత్‌నగర్‌లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో టిమ్స్‌ను నిర్మించారు. గత బీఆర్ఎస్ హయాంలో మొదలైన నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.1,070 కోట్లకు పైగా ఖర్చయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం నిర్మాణ వైశాల్యం దాదాపు 11.68 లక్షల చదరపు అడుగులు. ఒకే మాస్టర్ ప్లాన్ కింద ఆధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సముదాయంగా దీన్ని అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టుకు 2022 ఏప్రిల్‌లో పరిపాలనా అనుమతులు లభించగా, అదే నెలలో శంకుస్థాపన జరిగింది. 2023 ఫిబ్రవరిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) డిజైన్-బిల్డ్ విధానంలో నిర్మాణాన్ని చేపట్టింది.
ఆసుపత్రిలో మొత్తం 1,082 పడకలు ఉన్నాయి. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు, 88 అత్యవసర పడకలు, 30 డయాలసిస్ పడకలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా మరో 264 పడకలను కేటాయించారు. ప్రారంభ దశలో 582 పడకలతో సేవలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన సామర్థ్యాన్ని దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
టిమ్స్ సనత్‌నగర్‌ను సాధారణ ఆసుపత్రిగా కాకుండా కీలక వైద్య రంగాలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దారు. మొత్తం 37 వైద్య విభాగాల్లో సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ట్రామా కేర్ వంటి విభాగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
గుండె సంబంధిత సంక్లిష్ట వ్యాధులకు అధునాతన చికిత్సలు, శస్త్రచికిత్సలు చేసే సదుపాయాలు ఉన్నాయి. కిడ్నీ, కాలేయం, గుండె వంటి అవయవ మార్పిడి చికిత్సలకు అవసరమైన ప్రత్యేక మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన ‘గోల్డెన్ అవర్’లో రోగికి చికిత్స అందించేందుకు 24 గంటల ట్రామా కేర్ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఆసుపత్రిలో 3 టెస్లా ఎంఆర్‌ఐ, 128 స్లైస్ సీటీ స్కాన్, అధునాతన మమ్మోగ్రఫీ, క్యాత్ ల్యాబ్స్, రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంక్లిష్ట శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, మాడ్యులర్ థియేటర్లు, ప్రత్యేక ఐసీయూలు ఏర్పాటు చేశారు. రోబోటిక్ సర్జరీ సామర్థ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేలా మౌలిక వసతులను సిద్ధం చేశారు.
టిమ్స్ సనత్‌నగర్‌లోని అత్యంత ప్రత్యేకమైన సాంకేతిక సదుపాయాల్లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థ ఒకటి. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సాంకేతికత ద్వారా రక్త నమూనాలు, మందులు, వైద్య రిపోర్టులు, ఇతర అవసరమైన వస్తువులను ప్రత్యేక ట్యూబ్‌ల ద్వారా ఆసుపత్రిలోని వివిధ విభాగాల మధ్య వేగంగా తరలించవచ్చు. గాలి ఒత్తిడితో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా నమూనాలను సాధారణంగా ఒకటి నుంచి రెండు నిమిషాల్లో సంబంధిత విభాగానికి చేరవేయవచ్చు.
దీంతో ల్యాబ్‌లు, వార్డులు, ఫార్మసీ మధ్య నమూనాల రవాణాకు పట్టే సమయం తగ్గుతుంది. ముఖ్యంగా అత్యవసర చికిత్సల్లో పరీక్షల ఫలితాలు త్వరగా అందడం ద్వారా వైద్యులు నిర్ణయాలు వేగంగా తీసుకునే అవకాశం ఉంటుంది. రోగుల తరలింపును సులభతరం చేసేందుకు ప్రత్యేక లిఫ్టులు, రవాణా మార్గాలు కూడా రూపొందించారు. నర్స్ కాలింగ్ సిస్టమ్, అధునాతన పేషెంట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు, డయాగ్నస్టిక్ సేవలు ఆసుపత్రి కార్యకలాపాల్లో కీలకంగా పనిచేయనున్నాయి.
టిమ్స్ సనత్‌నగర్ ప్రధాన లక్ష్యం పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి తీసుకురావడం. అర్హులైన పేద రోగులకు వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు. దీంతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న రోగుల ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులతో పోలిస్తే తక్కువ ఖర్చుతో అధునాతన చికిత్స అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సేవలను దశలవారీగా విస్తరించనున్నారు. పేయింగ్ రోగుల కోసం కూడా నిర్దిష్ట సంఖ్యలో పడకలను కేటాయించే ప్రణాళిక ఉంది. ఈ విభాగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆసుపత్రి నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల సహాయకుల కోసం ఆసుపత్రి ప్రాంగణంలోనే జీ+5 అంతస్తుల ధర్మశాల నిర్మించారు. ఇందులో ఒకేసారి సుమారు 200 మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. 30 మృతదేహాల సామర్థ్యంతో మార్చురీ, సెంట్రల్ కిచెన్, లాండ్రీ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
టిమ్స్‌లో భవిష్యత్‌లో రోజుకు సుమారు 4 వేల మంది రోగులకు వైద్య సేవలు అందించే స్థాయిలో వ్యవస్థను రూపొందించారు. 2026 మే నుంచి ఓపీ ట్రయల్ రన్ నిర్వహించగా, రోజుకు వందలాది మంది రోగులు వైద్య సేవలు పొందారు. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు విస్తరించిన తర్వాత రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రభుత్వం వేలాది పోస్టులను మంజూరు చేసింది. వైద్యులు, నర్సులు, టెక్నికల్ సిబ్బంది, ఇతర విభాగాలకు చెందిన సిబ్బందిని దశలవారీగా నియమిస్తున్నారు. అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందితోపాటు కొత్త సిబ్బందిని కూడా సేవల్లోకి తీసుకుంటున్నారు. నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. నీటి వినియోగాన్ని గణనీయంగా తగ్గించే సాంకేతికత, వర్షపు నీటి సేకరణ, మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు. నీటి వినియోగంలో సుమారు 75 శాతం వరకు ఆదా చేసే విధానాలను అమలు చేసినందుకు ఆసుపత్రికి ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ లభించింది.