రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు.. కేంద్రం ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అస‌లేం జ‌రిగింది?

Published : Aug 21, 2026, 06:19 PM IST

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. అమెరికా వెళ్లేందుకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి అవసరమైన రాజకీయ అనుమతి లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

PREV
15
అమెరికా టూర్‌కు కేంద్రం అనుమతి నిరాకరణ

ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలకు కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. యూకే, అమెరికా పర్యటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొంతకాలం క్రితమే కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయితే రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతి లభించగా.. అమెరికా పర్యటనకు మాత్రం పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు.

అమెరికాలో పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కార్యాలయం షెడ్యూల్ రూపొందించింది. ప్రముఖ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యాలు, తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటుపై చర్చలు జరపాలని ప్రభుత్వం భావించింది. చివరికి అనుమతి రాకపోవడంతో సీఎం అమెరికా వెళ్లే కార్యక్రమం రద్దయింది.

25
రాజకీయ కారణాలతోనే అడ్డుకున్నారంటూ..

అమెరికా పర్యటనకు అనుమతి రాకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటనను రాజకీయ కోణంలో అడ్డుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విద్యా సంస్థలను తెలంగాణకు తీసుకురావడం, రాష్ట్ర యువతకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడం తన పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. విద్య, నైపుణ్యాలు, శిక్షణ రంగాల్లో అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తన విదేశీ పర్యటన ద్వారా తెలంగాణతో పాటు దేశానికీ ప్రయోజనం కలిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

35
సీఎం వెళ్లకపోయినా అధికారుల అమెరికా పర్యటన కొనసాగింపు

రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయినప్పటికీ అధికారుల బృందాన్ని మాత్రం అమెరికాకు పంపాలని సీఎం నిర్ణయించారు. ముందుగా రూపొందించిన కార్యక్రమాలను కొనసాగించాలని, ప్రతిపాదిత ఒప్పందాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హార్వర్డ్, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT), నార్త్‌ఈస్టర్న్ యూనివర్సిటీ, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యాలపై చర్చలు జరపాలని సూచించారు. తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు అందేలా ఎంవోయూలు కుదుర్చుకోవాలని ఆదేశించారు. విద్య కోసం తెలంగాణ యువత విదేశాలకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా.. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలను రాష్ట్రంలోనే అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

45
లండన్‌లో రేవంత్‌రెడ్డి బిజీ షెడ్యూల్

ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి యూకే పర్యటనలో ఉన్నారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన అనంతరం ఆయన నేరుగా లండన్‌ వెళ్లారు. అక్కడ పలు ప్రముఖ విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించడంతో పాటు కేంబ్రిడ్జ్ ప్రతినిధులతోనూ చర్చలు జరపనున్నారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని సెనేట్ హౌస్, లండన్ బిజినెస్ స్కూల్‌కు కూడా వెళ్లే కార్యక్రమం ఉంది. బ్రిటన్‌లోని ప్రముఖ విద్యా, స్పోర్ట్స్, స్కిల్లింగ్ సంస్థలతో తెలంగాణకు ఉపయోగపడే అవకాశాలపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఈ పర్యటన ముగిసిన తర్వాత ఈ నెల 23న రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

55
కేంద్రం వివరణ.. క్లియరెన్స్‌కు నిబంధనలే కారణమా?

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. ముఖ్యమంత్రులు, ఇతర ఉన్నతస్థాయి ప్రముఖుల విదేశీ పర్యటనలకు రాజకీయ అనుమతి ఇచ్చే ముందు పర్యటన ఉద్దేశం, కార్యక్రమాల స్వభావం, ఆయా పదవులకు అనుగుణంగా వాటి ప్రాధాన్యం వంటి అంశాలను మంత్రిత్వశాఖ పరిశీలిస్తుందని తెలిపారు.

ఈ సందర్భంలో అమెరికా పర్యటనకు సమర్పించిన ప్రతిపాదనలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని భావించడంతోనే అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన యూకే పర్యటనకు మాత్రం కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని గుర్తుచేశారు.

దీంతో అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఒకవైపు కేంద్రం నిర్ణయం నిబంధనల ప్రకారమే జరిగిందని విదేశాంగ శాఖ చెబుతుండగా.. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విద్య, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల కోసం చేపట్టిన పర్యటనకు రాజకీయ కారణాలు చూపడం సరికాదని అభిప్రాయపడుతోంది. ఇప్పుడు అధికారులు అమెరికా పర్యటనలో కుదుర్చుకునే ఒప్పందాలు, భాగస్వామ్యాలపై ఆసక్తి నెలకొంది.

Read more Photos on
click me!

Recommended Stories