Petrol: ఇరాన్, ఇజ్రాయెల్‌ల ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం తెలంగాణలో కూడా కనిపిస్తోంది. హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో పెట్రోల్ బంక్‌ల వద్ద ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు.
మంగళవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి. సోమాజిగూడ, ఎస్‌ఆర్ నగర్, ఉప్పల్, నాగోల్, బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో కొన్ని బంకులు తాత్కాలికంగా మూతపడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వాహనదారులు ఇంధనం కోసం ఒక బంక్ నుంచి మరో బంక్ వరకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా కొన్ని బంకుల్లో పరిమితంగా మాత్రమే ఇంధనం విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగా తెరిచి ఉన్న బంకుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు క్యూ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
25
క్రెడిట్ వ్యవస్థ మారడంతో ఏర్పడిన ఇబ్బందులు
పెట్రోల్ బంకుల యజమానుల ప్రకారం ప్రస్తుతం ఏర్పడిన సమస్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన మార్పులే. గతంలో ఆయిల్ కంపెనీలు డీలర్లకు క్రెడిట్‌పై ఇంధనం అందించేవి. కానీ ఇప్పుడు ‘నో క్రెడిట్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ముందుగా మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతే కొత్త స్టాక్‌ను సరఫరా చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేని కొంతమంది డీలర్లు కొనుగోళ్లు తగ్గించడంతో కొన్నిచోట్ల తాత్కాలిక కొరత కనిపిస్తోంది.
35
రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు తగ్గిన పరిస్థితి
తెలంగాణలో సుమారు 4,200 పెట్రోల్ బంకులు ఉండగా, అందులో హైదరాబాద్‌లోనే 1,200కి పైగా ఉన్నాయి. సాధారణంగా రోజుకు 40 లక్షల నుంచి 70 లక్షల లీటర్ల వరకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల కారణంగా డీలర్లు సుమారు 25 శాతం వరకు కొనుగోళ్లు తగ్గించినట్లు సమాచారం. మొదట జిల్లాల్లో ప్రారంభమైన ఈ సమస్య క్రమంగా నగరానికి కూడా చేరింది. దీంతో కొన్నిచోట్ల ఇంధనం కోసం వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
పెట్రోల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ గ్యాస్ విషయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ప్రాంతంలో గ్యాస్ నింపించుకునేందుకు ఆటోలు పెద్ద ఎత్తున క్యూ కట్టాయి. ఏజీ ఆఫీస్ నుంచి భారత్ పెట్రోల్ బంక్ వరకు వందలాది ఆటోలు వరుసలో నిలబడిన దృశ్యాలు కనిపించాయి. ఒక్కో డ్రైవర్ దాదాపు రెండు గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.
55
అధికారుల స్పందన.. పుకార్లను నమ్మొద్దని సూచన
హైదరాబాద్‌లో ఇంధన కొరతపై వచ్చిన వార్తల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందించారు. నగరంలో పెట్రోల్ లేదా ఎల్పీజీ కొరత లేదని, అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సరఫరా సజావుగా కొనసాగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒకేసారి బంకుల వద్దకు వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. పుకార్లను నమ్మకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా బుధవారం (రేపటి) నుంచి పెట్రోల్ దొరకదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున బంకులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారులు చెబుతున్నారు.