Padma Awards: ఏటా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే. ఆయా రంగాల్లో విశేష సేవలందించే ప్రముఖులను ఈ అవార్డులతో సత్కరిస్తుంటారు. అయితే ఈ అవార్డులను ఎక్కడ తయారు చేస్తారు.? ఎంత ఖర్చవుతుందో తెలుసా?
ప్రతి సంవత్సరం జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను ప్రకటిస్తుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డుల తొలి జాబితా ఇప్పటికే విడుదలైంది. దేశానికి విశేష సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డులు అందజేస్తారు. సామాజిక సేవ, వైద్యం, శాస్త్ర విజ్ఞానం, కళలు, సాహిత్యం, క్రీడలు, ప్రజాసేవ వంటి విభాగాల్లో అసాధారణ కృషి చేసినవారికి ఈ గౌరవం లభిస్తుంది.
పద్మ అవార్డులు మూడు రకాలుగా ఉంటాయి. అత్యున్నత స్థాయిలో పద్మ విభూషణ్, ఆ తర్వాత పద్మ భూషణ్, మూడో స్థాయిలో పద్మశ్రీ ఉంటాయి. ఇవి డబ్బుతో కొలవలేని జాతీయ గౌరవంగా భావిస్తారు. ఈ అవార్డులు పొందడం వ్యక్తిగత ప్రతిభకు మాత్రమే కాదు, దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా నిలుస్తాయి. అందుకే ప్రతి ఏడాది ఈ ప్రకటనపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తుంది.
25
పద్మ అవార్డు మెడల్స్ ఎక్కడ తయారవుతాయి?
పద్మ అవార్డులకు సంబంధించిన అన్ని మెడల్స్ కోల్‌కతాలో ఉన్న అలీపూర్ మింట్‌లో తయారవుతాయి. ఈ మింట్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేస్తుంది. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థ ఈ మింట్‌ను నిర్వహిస్తుంది.
అలీపూర్ మింట్‌కు చాలా పురాతన చరిత్ర ఉంది. ఇక్కడే భారతరత్న అవార్డు మెడల్స్ కూడా తయారవుతాయి. సంప్రదాయ మింటింగ్ పద్ధతులతో పాటు ఆధునిక నాణ్యత నియంత్రణ విధానాలను ఉపయోగించి ఈ మెడల్స్ తయారు చేస్తారు. ప్రతి పద్మ మెడల్‌పై కమలం చిహ్నం ఉంటుంది. దేవనాగరి లిపి, ఆంగ్ల భాషలో అవార్డు పేరు చెక్కుతారు. అత్యంత ఖచ్చితత్వంతో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు.
35
తయారీలో ఏం ఉపయోగిస్తారు.?
పద్మ అవార్డులు చాలా ప్రతిష్ఠాత్మకమైనవని తెలిసిందే. అయితే వీటిని బంగారం, వెండి వాటితో తయారు చేస్తారనుకోకండి. పద్మ విభూషణ మెడల్ ప్రధానంగా కాంస్యంతో తయారు చేస్తారు. ఈ మెడల్ రెండు వైపులా ప్లాటినం అలంకరణ ఉంటుంది. ఇది అత్యున్నత స్థాయి అవార్డు కావడంతో రూపకల్పన ప్రత్యేకంగా ఉంటుంది.
పద్మ భూషణ మెడల్ కూడా కాంస్యంతోనే తయారవుతుంది. అయితే దీనిపై బంగారు పూతతో అలంకరణ చేస్తారు. పద్మశ్రీ మెడల్ కాంస్యంతో తయారవుతుంది. దీనిపై స్టెయిన్‌లెస్ స్టీల్ అలంకరణ ఉంటుంది. విలువైన లోహాలు తక్కువగా వాడినా, ఈ అవార్డుల విలువ గౌరవంలోనే ఉంటుంది. అవార్డు భావన డబ్బుకు సంబంధించింది కాదు అనే సందేశం కూడా ఇందులో దాగి ఉంటుంది.
పద్మ అవార్డు మెడల్స్‌పై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది?
పద్మ అవార్డు మెడల్స్ తయారీకి అయ్యే ఖచ్చితమైన ఖర్చును ప్రభుత్వం బహిర్గతం చేయదు. కారణం ఏంటంటే, ఇవి ప్రభుత్వ ఆధీనంలోని మింట్‌లోనే తయారవుతాయి. అందువల్ల ఈ ఖర్చును సాధారణ ప్రభుత్వ తయారీ వ్యయాల్లో భాగంగా పరిగణిస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పద్మ అవార్డు పొందిన వారికి ఎలాంటి నగదు బహుమతి ఇవ్వరు. ప్రయాణ రాయితీలు, పెన్షన్, ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉండవు. ఈ అవార్డు పూర్తిగా గౌరవానికి సంబంధించినది. దేశం తరఫున ఇచ్చే గుర్తింపు మాత్రమే. సేవ, త్యాగం, సృజనాత్మకత, ప్రతిభకు ఇచ్చే జాతీయ ప్రశంసగా పద్మ అవార్డులు నిలుస్తాయి.
55
పద్మ అవార్డులు 2026
2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 132 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో 5 మందికి పద్మ విభూషణ, 13 మందికి పద్మ భూషణ, 114 మందికి పద్మశ్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. మాగంటి మురళీమోహన్(కళల విభాగం) , గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళల విభాగం) , గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) కళల విభాగం, వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య) అలాగే తెలంగాణ నుంచి పద్మశ్రీకి.. దీపికా రెడ్డి (కళల విభాగం) , గూడూరు వెంకట రావు (వైద్య విభాగం), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్య విభాగం), చంద్రమౌళి గడ్డముణుగు (సైన్స్–ఇంజనీరింగ్), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (సైన్స్, ఇంజనీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజనీరింగ్), రామారెడ్డి మామిడి (మరణానంతరం)–పశుసంవర్థక విభాగం ఎంపికయ్యారు.