TGSRTC Goa Tour Plan : గోవా టూర్ ప్లాన్ చేసుకుంటున్న యువతకు అద్భుత అవకాశం. తెలంగాణ ఆర్టిసి బడ్జెట్ ప్రెండ్లీ గోవా ట్రిప్ ప్లాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకొండి.
Goa Tour : స్నేహితులతో కలిసి గోవాకి వెళ్లి ఎంజాయ్ చేయాలనేది చాలామంది యువతీయువకుల కోరిక. కానీ వివిధ కారణాల వల్ల కొందరి గోవా టూర్ కలగానే మిగిలిపోతుంది... ఇందులో బడ్జెట్ కూడా ఓ కారణం. సొంత కారులో గోవాకు వెళ్లిరావడానికే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది... అలాంటిది ఇక ట్రావెల్స్, రైల్వే, విమానాల్లో ఖర్చు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే తెలుగు ప్రజలను తక్కువ ఖర్చులోనే గోవాకు తీసుకెళ్లే బాధ్యత తెలంగాణ ఆర్టిసి తీసుకుంది. బీచ్ టూరిజంతో పాటు ఆధ్యాత్మిక టూరిజంను కలిపి అందిస్తోంది... ఇందుకోసం సరికొత్త ప్లాన్ ను సిద్దం చేసింది. తక్కువ బడ్జెట్ లో గోవా ట్రిప్ కలను నెరవేర్చుకోవడంతో పాటు ప్రముఖ దేవాలయాలను సందర్శించే అద్భుత అవకాశం కల్పిస్తోంది.
25
టిజిఎస్ ఆర్టిసి గోవా టూర్ ప్లాన్...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రైవేట్ ట్రావెల్స్ తో పోటీ పడుతోంది. అధిక ఛార్జీలతో ప్రజలను దోచుకునే ప్రైవేట్ సంస్థలకు చెక్ పెట్టేలా టూరిస్ట్ ప్లాన్స్ సిద్దం చేసింది. ఇందులో భాగంగానే సెలవురోజుల్లో ఆద్యాత్మిక ప్రదేశాలు, ప్రకృతి అందాలతో కూడిన టూరిస్ట్ స్పాట్స్ కి బస్సులు నడుపుతోంది. లాభాపేక్షతో కాకుండా ప్రయాణికులకు సేప్టీ, మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది టీజిఎస్ ఆర్టిసి.
ఇటీవలే (జనవరి 23నుండి 1 నైట్, 2 డేస్) గానుగాపూర్, పండరీపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ యాత్ర ముగిసింది. కేవలం రూ.3000 తో ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు మరో యాత్రకు సిద్దమయ్యింది... వచ్చేనెల (ఫిబ్రవరిలో) గోవా, హంపి, తుల్జాపూర్ లను చుట్టివచ్చేలా టూర్ ప్లాన్ రెడీ చేసింది తెలంగాణ ఆర్టిసి.
35
కేవలం రూ.3500 తో గోవా, హంపి, తుల్జాపూర్ టూర్...
అందమైన బీచ్ లతో కూడిన గోవాకు కేవలం రూ.3500 వెళ్లిరావచ్చు... అదీ లగ్జరీ ఆర్టిసి బస్సుల్లో సేప్టీగా. సముద్రపు ఒడ్డున గల బీచ్ లో ఇసుకపై నడుస్తూ, అలల్లో ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. విదేశాల్లో ఉన్నామా అనిపించే గోవా కల్చర్ ని ఎంజాయ్ చేయవచ్చు… వీధుల్లో షాపింగ్ చేయవచ్చు.
ఈ టూర్ లో గోవాతో పాటు ప్రాచీన దేవాలయాలను కూడా సందర్శించవచ్చు. కర్ణాటకలో ప్రాచీన శిల్పకళాసంపదతో కూడిన హంపిని సందర్శించవచ్చు. అక్కడి విరూపాక్ష దేవాలయం, రాతి రథం వంటివి శిల్పకళా ప్రేమికులను ఆకట్టుకుంటాయి.
మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తుల్జాపూర్ ను కూడా ఈ టూర్ ప్లాన్ లో కవర్ చేస్తారు. ఇదికూడా ప్రాచీన దేవాలయం... భవానీమాత కొలువై ఉంటారు. ఈ ఆలయం దేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడే చత్రపతి శివాజీకి అమ్మవారు ఖడ్గాన్ని ప్రసాదించినట్లుగా చెబుతుంటారు.
ఫిబ్రవరి ఆరంభంలో గోవా, హంపి, తుల్జాపూర్ టూర్ ఉంటుంది... హైదరాబాద్ నుండి బస్సు ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 6న టూర్ ప్రారంభం... మొత్తం 3 నైట్స్, 4 డేస్ ట్రిప్. గోవాలో సరదాగా ఎంజాయ్ చేసేందుకు... హంపి, తుల్జాపూర్ దేవాలయాల్లో దర్శనానికి, ఇతర ప్రదేశాలను చూడటానికి సమయం కేటాయిస్తారు. తిరిగి హైదరాబాద్ కు చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది.
55
గోవా టూర్ బుకింగ్, సంప్రదించాల్సిన నెంబర్లు
తెలంగాణ ఆర్టిసి అందించే గోవా, హంపి, తుల్జాపూర్ టూర్ కి వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం TGSRTC అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ముందుగా బుకింగ్ చేసుకున్నవారికే అవకాశం కల్పిస్తారు... అప్పటికప్పుడు టికెట్లు దొరక్కపోవచ్చు. ఈ గోవా టూర్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం 9391072283 లేదా 9063401072 నెంబర్లకు ఫోన్ చేయండి.