Murali Divi : రూ.250 జీతం నుండి రూ.1.50 లక్షల కోట్ల వ్యాపారవేత్తగా... రిచ్చెస్ట్ తెలుగు పర్సన్ అతడే
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఆయన సక్సెస్ స్టోరీ ఆకట్టుకునేలా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా? ఆయన సక్సెస్ స్టోరీ ఆకట్టుకునేలా ఉంటుంది.
Murali Divi : ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు? అనగానే టక్కున ఎలాన్ మస్క్ పేరు వినిపిస్తుంది. అదే భారతదేశంలో రిచ్చెస్ట్ పర్సన్ ఎవరంటే ముఖేష్ అంబానీ పేరు వినిపిస్తుంది. అదే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతుడు ఎవరు? అంటే చాలామంది సమాధానం చెప్పలేరు, తడబడతారు. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఈ ప్రశ్నకు జవాబు తెలియదు.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో చాలామంది అత్యంత పేదరికం నుండి అత్యున్నత స్థానాలకు ఎదిగినవారు ఉన్నారు. ఇలాంటివారికి దివీస్ లేబోరేటరీస్ వ్యవస్ధాపకులు మురళి దివి ఒకరు. ఆయనే తెలుగోళ్లలో అత్యంత ధనికుడు. ఆయన చేసే వ్యాపారాలేమిటి? ఆస్తిపాస్తులెన్ని? ఎంత కష్టపడితే ఇంత గొప్ప స్థానానికి చేరుకున్నారు? తదితర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
రూ.250 జీతం నుండి లక్షల కోట్ల ఆస్తుల వరకు... మరళి దివి ప్రయాణం :
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంతెన మురళీ దివి స్వగ్రామం. ఆయన తండ్రి సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగి. మద్యతరగతి కుటుంబానికి చెందిన సత్యనారాయణకు 13మంది సంతానం. వీరిలో ఒకరే మురళి దివి.
మురళి దివి తండ్రి ఆ రోజుల్లోనే డిగ్రి వరకు చదువుకున్నాడు. చదువు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి తన బిడ్డలందరికి మంచి చదువు అందించాలని ప్రయత్నించాడు. ఇది తనకు ఆర్థిక భారం అయినా ఆయన బిడ్డలను చదివించారు. కానీ మురళి చిన్నతనంలో పెద్దగా చదివేవాడు కాదు. పాఠశాల విద్యా ఎలాగోలా పూర్తిచేసినా ఇంటర్ లో అతడు ఫెయిల్ అయ్యాడు. కానీ తర్వాత కష్టపడి చదివి ఇంటర్మీడియట్ పూర్తిచేసాడు.
కర్ణాటక మణిపాల్ అకాడమీ నుండి బీఫార్మసి పూర్తిచేసాడు మురళి. ఇంటర్ లో ఫెయిలైన అతడు బీఫార్మసిలో విశ్వవిద్యాలయం టాపర్ గా నిలిచాడు. అదే యూనివర్సిటీ నుండి ఎంఫార్మసి పట్టాను గోల్డ్ మెడల్ తో సహా అందుకున్నాడు. తర్వాత తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ నుండి ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ లో పిహెచ్డి పూర్తిచేసాడు. ఇలా ఓవైపు పిహెచ్డి చేస్తూనే మరోవైపు హైదరాబాద్ లోని వార్నర్ హిందుస్థాన్ సంస్థలో నెలకు రూ.250 జీతంతో పనిచేసాడు.
పిహెచ్డి తర్వాత ఫార్మా రంగంలో మంచి అవకాశాలున్నాయని తెలిసి అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి అతడికి చాలా ఈజీగా అమెరికా వీసా వచ్చింది. దీంతో అతడు చేతిలో కొంత చిల్లర మాత్రమే పెట్టుకుని అమెరికా పయనమయ్యాడు. అక్కడ చాలాకాలం ఫార్మారంగంలో పనిచేసారు... అంచెలంచెలుగా ఎదిగా ఓ ఫార్మా కంపనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు. లక్షల జీతం, మంచి ఉద్యోగంతో జీవితం హాయిగా సాగుతుండగా మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మురళి.
దివీస్ లేబోరేటరీస్ ఏర్పాటుతో రిచ్చెస్ట్ తెలుగు వ్యక్తిగా...
అమెరికాలో మంచి జీవితాన్ని వదిలేసి ఇండియాకు తిరిగివచ్చారు మురళీ దివి. స్వదేశంలో ఫార్మా రంగానికి మంచి భవిష్యత్ ఉందని తెలిసి వచ్చారు... కానీ ఇక్కడికి వచ్చాక ఏం చేయాలో అర్థంకాలేదు. వ్యాపారం చేద్దామంటే డబ్బులు లేవు... ఉద్యోగమా చేయలేదు. ఇలాంటి డైలమా స్థితిలో ఉండగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ వ్యవస్థాపకులు అంజిరెడ్డి ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇలా మెల్లిగా ఫార్మా రంగంలో అడుగుపెట్టారు.
ఇక సొంతంగా 1990 లో దివీస్ లేబోరేటరీస్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. ఒకటితర్వాత ఒకటిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్లాంట్స్ స్థాపించి లక్షల కోట్ల ఆస్తులకు అధినేతగా ఎదిగారు. 2023 నాటికి ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు... బిలీయనీర్ అయ్యారు. ప్రపంచంలో టాప్ 500 ధనవంతులు, భారతదేశంలో టాప్ 100 మంది ధనవంతులు మురళి దివి ఒకరు... తెలుగు రాష్ట్రాల్లో టాప్ 1 ధనవంతుడు ఆయనే.