హైదరాబాద్ నుండి ఆంధ్రాకు ప్రయాణం మరింత చౌక ... ఈ రూట్లో వెళితే మీ డబ్బులు ఆదా
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి గుడ్ న్యూస్. ఇకపై వీరి ప్రయాణం మరింత చౌక కానుంది... ఎందుకో తెలుసా?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి గుడ్ న్యూస్. ఇకపై వీరి ప్రయాణం మరింత చౌక కానుంది... ఎందుకో తెలుసా?
Hyderabad to Vijayawada Journey : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఏ పండగున్నా, శుభకార్యాలున్నా సొంతూళ్లకు వెళుతుంటారు. ఇలా ఏపీ-తెలంగాణ మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి గుడ్ న్యూస్. ఇవాళ(సోమవారం) అర్థరాత్రి నుండి తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ ఖర్చులు తగ్గనున్నాయి.
హైదరబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గల టోల్ గేట్లలో టోల్ ఛార్జీలు తగ్గించారు. ఈ తగ్గింపు సోమవారం అర్థరాత్రి 12 గంటల తర్వాత అంటే ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది... కొత్త టోల్ ఛార్జీల వివరాలను కూడా ప్రకటించింది.
హైదరాబాద్-విజయవాడ హైవేపై కొత్త టోల్ చార్జీలివే :
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య రవాణా కోసం జాతీయ రహదారి-65 చాలా కీలకమైనది. ఈ హైవే మీదుగానే ఇరు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా అయినా, ప్రయాణికుల రవాణా అయినా ఎక్కువగా జరిగేది. అందువల్లే ఈ హైవే నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక సంక్రాంతి వంటి పండగల సమయంలో అయితే ఈ హైవేపై కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్ చూస్తుంటాం. అంత రద్దీగా ఉంటుంది.
ఇలా తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం రాకపోకలు సాగించేవారికి నేషనల్ హైవేస్ అథారిటీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ రహదారిలో చౌటుప్పల్ వద్దగల పతంగి టోల్ ప్లాజా, కేతేపల్లి వద్దగల కొర్లపహాడ్ టోల్ ప్లాజా, ఏపీలోని చిల్లకల్లు టోల్ ప్లాజాలో ఇకపై టోల్ చార్జీలు తక్కువగా వసూలు చేయనున్నారు. ఇలా టోల్ భారం తగ్గడంతో ప్రయాణఖర్చులు తగ్గి డబ్బులు ఆదా అవుతాయి. ముఖ్యంగా సరుకు రవాణా వాహనాల యజమానులకు ఎక్కువ లబ్ది జరుగుతుంది.
పతంగి టోల్ ప్లాజా వద్ద వ్యక్తిగత వాహనాలు అంటే కార్లు, జీపులు, వ్యాపులపై టోల్ చార్జీలు రూ.15 తగ్గాయి. ఇరువైపులా అంటే రూ.30 తగ్గాయి. ఇక తేలికపాటి వాణిజ్య వాహనాలకు ఓవైపు అయితే రూ.25, ఇరువైపుల అయితే రూ.40 తగ్గాయి. పెద్దపెద్ద వాహనాలు అంటే బస్సులు, లారీలు. ట్రక్కులకు ఒకవైపు అయితే రూ.50, ఇరువైపుల అయితే రూ.75 తగ్గించారు. మిగతా కోర్లపహాడ్ , చిల్లకల్లు టోల్ ప్లాజాల్లో కూడా టోల్ ఛార్జీలు తగ్గాయి... ఒక్కో టోల్ ప్లాజాలో టోల్ చార్జీల తగ్గింపు ఒక్కోలా ఉన్నాయి.
తగ్గింపు అనంతరం పతంగి టోల్ ప్లాజా వద్ద కారు, జీపు, వ్యాన్ వంటి లైట్ మోటార్ వెహికిల్స్ పై ఒకవైపు ఛార్జీలు రూ.80, రెండువైపుల అయితే రూ.115 వసూలు చేస్తారు. ఈ వాహనాలకు కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద అయితే ఒకవైపు రూ.120, ఇరువైపుల 180... చిల్లకల్లు టోల్ ప్లాజాలో ఒకవైపు రూ.105, ఇరువైపుల రూ.155 వసులు చేస్తారు.
లైట్ కమర్షియల్ వాహనాలు, లైట్ గూడ్స్ వాహనాలు అంటే మినీ బస్సులు, చిన్న సరుకు రవాణా వాహనాలకు పతంగి టోల్ ప్లాజాలో ఒకవైపు రూ.125, రెండువైపుల రూ.190... కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఒకవైపు రూ.195, రెండువైపుల రూ.295... చిల్లకల్లు టోల్ ప్లాజాలో ఒకవైపు రూ.165, రెండువైపుల రూ.250 వసూలు చేస్తారు.
పెద్ద వాహనాలు అంటే బస్సు, ట్రక్కులకు పతంగి టోల్ ప్లాజా వద్ద ఒకవైపు రూ.265, రెండువైపుల రూ.395... కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఒకవైపు రూ.410, రెండువైపుల రూ.615, చిల్లకల్లు వద్ద ఒకవైపు 350, రెండువైపుల రూ.520 తగ్గించారు.
వాణిజ్య వాహనాలకు పతంగి టోల్ ప్లాజా వద్ద ఒకవైపు అయితే రూ.290, రెండువైపుల అయితే రూ.435 వసూలు చేయనున్నారు. అదే కొర్లపహాడ్ టోల్ ప్లాజాలో ఒకవైపు రూ.450, రెండువైపుల రూ.675... చిల్లకల్లు వద్ద ఒకవైపు అయితే రూ.380, రెండువైపుల అయితే రూ.570 వసూలు చేయనున్నారు.
టోల్ ఛార్జీలు ఎందుకు తగ్గాయి?
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్, విజయవాడ మధ్యగల జాతీయ రహదారి-65 ని జిఎమ్మార్ సంస్థ నాలుగు లైన్లుగా విస్తరించింది. 181 కిలోమీటర్ల రహదారిని రూ.1740 కోట్ల నిధులతో విస్తరించింది. ఇందుకు గాను 2012 చివరినుండి టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూళ్లు చేపట్టింది. ఇలా దాదాపు 12 ఏళ్ళపాటు ఈ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణ బాధ్యతలు జిఎమ్మార్ సంస్థ చేపట్టింది.
అయితే గతేడాది 2024 లో జిఎమ్మార్ సంస్థకు టోల్ వసూలు గడువు ముగిసింది... దీంతో నేషనల్ హైవే అథారిటీ ఈ టోల్ వసూలు బాధ్యతలు తీసుకుంది. ప్రత్యేక ఏజన్సీ ద్వారా టోల్ చార్జీల వసూలు చేపట్టింది... ఈ క్రమంలోనే వాహనదారులపై భారం తగ్గించేందుకు తాజాగా టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.