Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే

Published : Sep 06, 2026, 11:09 AM IST

NMMSS Scholarship 2026: 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఎన్ఎమ్‌ఎమ్‌ఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు. అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేంద్రం నుంచి ఏటా రూ. 12,000 ఆర్థిక సాయం

చదువుకోవాలనే ఆసక్తి, మంచి ప్రతిభ ఉన్నప్పటికీ చాలా మంది విద్యార్థులకు పేదరికం పెద్ద శాపంగా మారుతోంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతో మంది పిల్లలు ఎనిమిదో తరగతి పూర్తి కాగానే చదువుకు స్వస్తి చెప్తున్నారు. ఇలాంటి డ్రాపౌట్స్‌ను అరికట్టడానికి, పేద విద్యార్థులను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే 'నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్' (NMMSS). ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి ఏకంగా రూ. 12,000 సహాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది.

25
దరఖాస్తు గడువు పొడిగింపు వివరాలు

కేంద్ర విద్యార్థి సంక్షేమ, అక్షరాస్యత శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఎన్ఎమ్‌ఎమ్‌ఎస్ (NMMSS) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అప్లికేషన్ డెడ్‌లైన్‌ను సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఆగస్టు 31 నాటికి అందిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 79,398 కొత్త దరఖాస్తులు, 1,87,208 రీన్యూవల్ అప్లికేషన్లు వచ్చాయి. ఇంకా అప్లై చేసుకోని విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ద్వారా వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.

35
అర్హతా ప్రమాణాలు, ఇతర సడలింపులు

ఈ స్కాలర్‌షిప్ పొందడానికి విద్యార్థుల కుటుంబ వార్షిక రాబడి రూ. 3.50 లక్షలకు మించకూడదు. అలాగే విద్యార్థి ఏడో తరగతి పరీక్షల్లో కనీసం 55 శాతం మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్ సాధించి ఉండాలి. ఎస్సీ (SC), ఎస్టీ (ST) కేటగిరీలకు చెందిన విద్యార్థులకు మార్కులలో 5 శాతం సడలింపు ఇచ్చారు. అంటే వీరికి 50 శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది. కేవలం ప్రభుత్వ, ప్రభుత్వ సాయం పొందే, లోకల్ బాడీ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు.

45
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

ప్రతి ఏటా 9వ తరగతి చదువుతున్న లక్ష మంది కొత్త విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను కేటాయిస్తారు. ఆయా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించే ప్రత్యేక ప్రతిభా పరీక్షలో మెరిట్ సాధించిన వారికి ఈ అవకాశం దక్కుతుంది. 9వ తరగతిలో ఎంపికైన విద్యార్థికి పదో తరగతి, ఇంటర్మీడియట్ (11, 12 తరగతులు) పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం రూ. 12,000 చొప్పున స్కాలర్‌షిప్ అందుతూనే ఉంటుంది. అయితే తదుపరి తరగతుల్లో మంచి అకడమిక్ పెర్ఫార్మెన్స్ చూపుతూ రీన్యూవల్ చేసుకుంటూ ఉండాలి.

55
అప్లికేషన్ వెరిఫికేషన్ అండ్ మనీ ట్రాన్స్‌ఫర్

విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దరఖాస్తులు రెండు దశల్లో వెరిఫై అవుతాయి. లెవెల్-1 (L1) పరిశీలనను ఆయా పాఠశాలల ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (INO) అక్టోబర్ 15, 2026 లోపు పూర్తి చేయాలి. లెవెల్-2 (L2) పరిశీలనను డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ (DNO) అక్టోబర్ 31, 2026 లోపు పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పూర్తయ్యాక, పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతి ద్వారా నగదు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories