
Holidays : సెలవులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి... ఎల్కేజీ పిల్లాడినుండి రిటైర్మెంట్ వయసు గల ఉద్యోగి వరకు ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అని ఎదురుచూస్తుంటారు. క్యాలెండర్ లో పండగలు, పర్వదినాలు, ప్రత్యేక రోజుల కోసం వెతుకుతుంటారు. ఆదివారం కాకుండా వారంమధ్యలో ఏదైనా సెలవు వచ్చిందా... వారి ఆనందానికి అవధులుండవు. ఇక ఆదివారంతో మరేదైనా సెలవు కలిసివచ్చిందంటే ఆ ఆనందం రెట్టింపవుతుంది... ఇక లాంగ్ వీకెండ్ వచ్చిందంటే ఎగిరిగంతేస్తారు.
అయితే ఈ శని, ఆదివారం (జులై 12,13) వరుస సెలవు వస్తున్నాయి... కొందరు తెలంగాణ విద్యార్థులకు ఇంతకంటే గుడ్ న్యూస్ ఉంది. ఈ రెండ్రోజులతో పాటు వచ్చే సోమవారం కూడా కొందరికి సెలవు ఉండే అవకాశాలున్నాయి. ఇలా వరుసగా మూడురోజులు సెలవులు వస్తే వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతుంది.
కేవలం స్కూల్ విద్యార్థులకే కాదు ఉద్యోగులకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి... వారికి మూడ్రోజులు కాకున్నా రెండ్రోలయితే ఖచ్చితంగా సెలవులు ఉంటాయి. కాబట్టి బోనాల పండగను కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకోవచ్చు. లేదంటే ఈ ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలతో కలిసి మంచి ప్రకృతి అందాలతో నిండిన టూరిస్ట్ ప్రాంతాలకు, ఆద్యాత్మిక ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. మూడ్రోజులు హాయిగా గడుపుతూ ఎంజాయ్ చేయవచ్చు.
సాధారణంగా ప్రతినెలా రెండో శనివారం స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉంటుంది. అలాగే కొందరు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రతి శనివారం సెలవు ఉంటుంది. ఇలా ఈ నెలలో నెక్ట్స్ వచ్చేది రెండో శనివారం (జులై 12). కాబట్టి విద్యార్థులతో పాటు కొందరు ఉద్యోగులకు ఈరోజు సెలవు ఉంటుంది. తర్వాతిరోజు ఆదివారం కాబట్టి ఎలాగూ సెలవే. ఇలా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు వరుసగా రెండ్రోజులు సెలవులే.
అయితే ఈ ఆదివారం తెలంగాణ ప్రజలకు చాలా స్పెషల్ డే. ఆషాడమాసంలో వస్తున్న ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. లష్కర్ బోనాలుగా పిలిచే ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారికి బోనాల సమర్పణ, పలహారం బండ్ల ఊరేగింపు, భవిష్యవాణి... ఇలా రెండు రోజులపాటు బోనాల వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి.
ఇలా ఆది, సోమవారం రెండ్రోజులు సికింద్రాబాద్ బోనాల వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ ప్రాంతమంతా భక్తులు, బోనాల ఊరేగింపులు, రాజకీయ నాయకులు, విఐపిల రాకపోకలు, పలహారం బండ్లతో రద్దీగా ఉంటుంది. కాబట్టి సోమవారం కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం సమీపంలోని స్కూళ్లు, కాలేజీలతో పాటు వ్యాపారసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి సెలవు ఉండే అవకాశాలున్నాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా వచ్చే శని, ఆదివారం సెలవులుంటే సికింద్రాబాద్ ప్రాంతంలో మాత్రం సోమవారం కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి.
అయితే ఈ సోమవారం సెలవులపై సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే వ్యాపారసంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగుల సెలవులపై నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి అధికారికంగా సమాచారం ఉంటేనే సెలవుగా పరిగణించాలి.
సికింద్రాబాద్ బోనాలు ముగిసిన తర్వాతి ఆదివారం(జులై 20) హైదరాబాద్ నగరం మొత్తం బోనాల వేడుకలు జరుపుకుంటుంది. నగరంలోని అమ్మవార్ల దేవాలయాలన్ని పండగ శోభను సంతరించుకుంటాయి... డప్పుచప్పుళ్లు, ఆడబిడ్డల బోనాల ఊరేగింపుతో ఆ రోజంతా సందడిగా ఉంటుంది. నగరవాసులు చుట్టాలను, స్నేహితులను ఆహ్వానించి మేక లేదా కోడికూరతో విందు... మగవాళ్లంతా మందుతో పండగ చేసుకుంటారు.
ఇలా ఆదివారం బోనాల నేపథ్యంలో తర్వాతి రోజు అంటే జులై 21 సోమవారం తెలంగాణ ప్రభుత్వం అదికారిక సెలవు ప్రకటించింది. ఆరోజు విద్యాసంస్థలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవే. కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఈ సెలవు వర్తిస్తుంది.
బోనాల పండగ కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారు... కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లో సోమవారం ఎలాంటి సెలవు లేదు. కేవలం రెండో శనివారం(జులై 12), ఆదివారం (జులై 13) రెండ్రోజులు మాత్రమే సెలవు ఉంటుంది. సోమవారం(జులై 14న) యధావిధిగా విద్యాసంస్థలు కొనసాగుతాయి. అలాగే జులై 20న ఆదివారం ఒక్కరోజే సెలవు…. జులై 21 సోమవారం ఎలాంటి సెలవు ఉండదు.