New Airport: తెలంగాణ‌లో మ‌రో కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చేస్తోంది.. ఈ ప్రాంత ప్ర‌జ‌లకు ఇక పండ‌గే

Published : Oct 13, 2025, 10:51 AM IST

New Airport: తెలంగాణ‌లో కొత్త విమానాశ్రాయ‌ల నిర్మాణానికి అడుగులు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే వ‌రంగ‌ల్ విమానాశ్రయానికి శ్రీకారం ప‌డ‌గా తాజాగా మ‌రో కొత్త ఎయిర్ పోర్ట్‌ను నిర్మించేందుకు ముంద‌డుగు ప‌డింది. ఇంత‌కీ కొత్త ఎయిర్‌పోర్ట్ ఎక్క‌డ రానుందంటే.? 

PREV
15
తెలంగాణ‌లో కొత్త ఎయిర్‌పోర్టు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ వైమానిక అనుసంధానాన్ని విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల నివేదిక తయారీ కోసం ప్రభుత్వం రూ.40.53 లక్షలు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI)కి మంజూరు చేసింది. రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

25
అంతర్గాం కొత్త స్థలంగా ఎంపిక

మొదట బసంత్‌నగర్‌లో విమానాశ్రయం నిర్మాణం చేప‌ట్టాల‌ని భావించారు. అయితే అక్కడి భూభాగం సాంకేతికంగా, ఆర్థికంగా అనుకూలం కాకపోవడంతో ప్రాజెక్టులో మార్పులు చేశారు. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో 591.24 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించి, ఆ ప్రాంతంపై సమగ్ర TEFR (Technical and Economic Feasibility Report) సిద్ధం చేయాలని AAIకి బాధ్యత అప్పగించారు. నివేదిక పూర్తయ్యాక ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తదుపరి చర్యలు ప్రారంభమవుతాయి.

35
పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతం

రామగుండం, పెద్దపల్లి ప్రాంతం పరిశ్రమల హబ్‌గా ఎదుగుతోంది. ముఖ్యంగా సింగరేణి కోల్ కంపెనీ, NTPC, ఫర్టిలైజర్ ప్లాంట్లతో పాటు పలు మైనింగ్ యూనిట్లు ఇక్కడ ఉన్నాయి. కొత్త ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ఈ సంస్థలకు రవాణా సౌలభ్యం పెరుగుతుంది. వ్యాపార, పెట్టుబడి అవకాశాలు విస్తరించడంతో పాటు పర్యాటక రంగం కూడా బలోపేతం అవుతుంది. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి.

45
తెలంగాణలో మిగతా ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులు

తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ఒక్క ఎయిర్‌పోర్ట్ (శంషాబాద్) మాత్ర‌మే ఉంది. ఈ క్ర‌మంలోనే వరంగల్‌లోని మూమునురులో ప్రాజెక్టును పట్టాలెక్కించగా.. ఆదిలాబాద్లో కూడా ఎయిర్‌పోర్టు నిర్మించాలని సంకల్పిస్తోంది. వరంగల్‌లోని ఎయిర్‌పోర్టు కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, ఐటీ కారిడార్ అభివృద్ధికి కీలకంగా మారనుంది. ఆదిలాబాద్ విమానాశ్రయం వల్ల మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకూ కనెక్టివిటీ లభిస్తుంది. ఇవన్నీ కలిపి తెలంగాణలో వ్యాపార, వాణిజ్య రంగాల సమతుల్య అభివృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.

55
సాకారం కానున్న రామగుండం ప్రజల కల

రామగుండం ఎయిర్‌పోర్టు అంశం ఎన్నో ఏళ్లుగా నానుతోంది. ఇప్పుడు ఆ కల సాకారం దిశగా తొలి అడుగు పడడంతో అక్కడి ప్రజలు సంతోషిస్తున్నారు. ఇదే విషయమై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, "ఈ ప్రాజెక్టు అమలు ద్వారా స్థానిక ప్రజలు, సింగరేణి సిబ్బంది, విద్యార్థులు, వ్యాపార వర్గాలు లాభపడతారు. ఇకపై హైదరాబాద్ చేరుకోవడానికి గంటల ప్రయాణం అవసరం ఉండదు. ప్రత్యక్ష వైమానిక కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది" అని అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories