IMD Cold Wave Alert : తెలుగు ప్రజలను చలి వణికిస్తోంది. ఇలా వర్షాలు తగ్గుముఖం పట్టాయోలేదో అలా చలి తీవ్రత పెరుగుతూవస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయోలేదో చలి మొదలయ్యింది. శీతాకాలం ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... మరీముఖ్యంగా హైదరాబాద్ తో పాటు శివారుప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. తెల్లవారుజామున పొగమంచు కప్పేసిన చల్లని వాతావరణం ప్రజలను వణికిస్తోంది... వాహనదారులను ఇబ్బంది పెడుతోంది.
26
ఈ రెండ్రోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలే
ఈ రెండ్రోజులు (అక్టోబర్ 13, 14) తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని... చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ప్రస్తుతం భారీ వర్షాలేమీ లేవుకాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని... మంగళవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. హైదరాబాద్ సహా వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 17-19 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు.
36
తెలంగాణ అత్యల్ఫ ఉష్ణోగ్రతలు ఇక్కడే..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం... ఈ శీతాకాలంలో మొదటిసారి అత్యల్పంగా మెదక్ లో 17.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో 18.2, నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 18.6, రాజేంద్రనగర్ లో 19, ఆదిలాబాద్ లో 19.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్నిజిల్లాల్లోనూ 20-25 డిగ్రీ సెల్సియస్ మద్య ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా ఖమ్మంలో 34.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షాల విషయానికి వస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా ఇవాళ (అక్టోబర్ 13, సోమవారం) కూడా కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఆయా రాష్ట్రాల వాతావరణ విభాగాలు ప్రకటించారు.
నేడు ఆంధ్ర ప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
56
నేడు తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో కూడా ఇవాళ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట... అందుకే వీటికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కి.మీ వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
66
తెలంగాణ దంచికొట్టిన వానలు... ఇక్కడ 100మిమీ రికార్డు
నిన్న(ఆదివారం) సాయంత్రం నుండి రాత్రివరకు కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగులోని కొన్నిచోట్ల 100 మిల్లి మీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యిందని వెల్లడించారు. భువనగిరిలో ఈ ఉదయం కూడా వర్షం కొనసాగుుతోందని... జనగాంలో కూడా రాబోయే రెండుమూడు గంటల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.