MMTS Train: హైద‌రాబాద్ టూ యాద‌గిరిగుట్ట‌.. రూ. 20 టికెట్‌, గంట‌లోపే ప్ర‌యాణం. ట్రాఫిక్ స‌మ‌స్య కూడా ఉండ‌దు

Published : Jul 20, 2025, 10:07 AM IST

యాద‌గిరిగుట్ట ల‌క్ష్మీ న‌రసింహ స్వామి ఆల‌యానికి భ‌క్తుల తాకిడి రోజురోజుకీ పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా వీకెండ్ వ‌స్తే చాలు హైద‌రాబాద్ నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు వెళ్తున్నారు. అయితే ఇక‌పై హైద‌రాబాద్ నుంచి యాద‌గిరిగుట్ట ప్ర‌యాణం మ‌రింత సులువు కానుంది. 

PREV
15
యాదాద్రి భక్తులకు శుభవార్త

హైదరాబాద్‌ నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లే భక్తుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్‌ (MMTS) మూడో లైన్ నిర్మాణానికి రూ. 412 కోట్ల మేర ఆమోదం ప్రకటించింది. ఘట్‌కేసర్‌ నుంచి భువనగిరి (రాయగిరి) వరకు 33 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అభివృద్ధికి ఈ నిధులు కేటాయించారు. ప్రాజెక్టు ప్రారంభ దశకే రూ. 100 కోట్లు విడుదల చేశారు.

25
ట్రాఫిక్, ఛార్జీల ఇబ్బందులకు చెక్

ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి యాదాద్రి ప్రయాణం ప్రధానంగా రోడ్డుమార్గంలోనే ఉంది. అయితే విప‌రీత‌మైన ట్రాఫిక్ కార‌ణంగా న‌గ‌ర శివారుకు వెళ్ల‌డానికి గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. అలాగే ప్రైవేట్ వాహనాల్లో అధిక చార్జీలు, బస్సులలో ఖర్చు పెరగడం భక్తులకు పెద్ద సమస్యగా మారింది. కొన్ని సార్లు 4-5 గంటల వరకు ప్రయాణం సాగుతుంది. రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే కేవలం రూ. 20 టికెట్ ధరతో గంటలోపే యాదాద్రికి చేరుకోవచ్చు.

35
ట్రైన్ ప్రాజెక్టు పూర్తి వివరాలు

ఈ ప్రాజెక్టు భాగంగా ఘట్‌కేసర్‌ నుంచి భువనగిరి వరకు మూడో లైన్ వేయనున్నారు. రైల్వే స్థలాల్లో ప్రాథమికంగా మట్టి పనులు మొదలయ్యాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఘట్‌కేసర్‌ నుంచి వంగపల్లి వరకు నాలుగో లైన్ కోసం కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే 79 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించేందుకు రైల్వే అధికారులు సన్నద్ధమవుతున్నారు.

45
పార్ల‌మెంట్‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశం

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో ఈ అంశాన్ని గ‌త ఏప్రిల్ నెల‌లో ప్రస్తావించగా, రైల్వే శాఖ మంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ రూ. 100 కోట్లు మంజూరు చేసినట్లు లేఖ ద్వారా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ను మొదటగా 2016-17లో ప్రతిపాదించినప్పటికీ, నిధుల కొరత కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు కేంద్రం మొత్తం వ్యయాన్ని భరించబోతుంది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

55
భక్తులకు, స్థానికులకు ప్రయాణం ఇక సులువు

ఎంఎంటీఎస్‌ లైన్ అందుబాటులోకి వస్తే యాదాద్రి, జనగామ ప్రజలకు హైదరాబాద్ చేరుకోవడం మరింత సులభమవుతుంది. మౌలాలీ నుంచి ఘట్‌కేసర్‌ వరకు ఇప్పటికే రెండు కొత్త ఎంఎంటీఎస్‌ లైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఘట్‌కేసర్‌ నుంచి భువనగిరి వరకు రైలు ట్రాక్ వేయడం ద్వారా యాదాద్రి పూర్తిస్థాయి కనెక్టివిటీ సాధ్యం కానుంది. దీంతో సౌకర్యవంతమైన, చౌకైన రైలు ప్రయాణం భక్తులకు అందుబాటులోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories