KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. చాలా ఏళ్ల తర్వాత ఈరోజు థియేటర్‌కి వెళ్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇంతకీ కేటీఆర్ వెళ్తున్న ఆ సినిమా ఏంటంటే.?
నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ యాక్షన్ సన్నివేశాలు, మాస్ ట్రీట్‌మెంట్‌కు బి, సి సెంటర్లలో మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని నిర్ణయించుకున్నారు. శనివారం రాత్రి ‘ది ప్యారడైజ్’ను వీక్షించనున్నట్లు ఆయన స్వయంగా ఎక్స్ ద్వారా వెల్లడించారు.
24
నాని, శ్రీకాంత్ ఓదెలపై ప్రశంసలు
చాలా కాలం తర్వాత థియేటర్‌కు వెళ్లి సినిమా చూడబోతున్నట్లు కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. తనకు నచ్చిన నటుల్లో నాని ఒకరని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆయన కలిసి రూపొందించిన ‘ది ప్యారడైజ్’ను చూడబోతున్నానని తెలిపారు. కేటీఆర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ నేపథ్యంతో ముడిపడిన అంశాలు సినిమాలో ఉండటంతో ఆయన ఈ మూవీపై ఆసక్తి చూపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
34
కేసీఆర్‌ను పోలిన ‘శంకరన్న’ పాత్ర
‘ది ప్యారడైజ్’లో నటుడు ప్రియదర్శి పోషించిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రపై విడుదలకు ముందు నుంచే ఆసక్తి నెలకొంది. ఈ పాత్ర రూపకల్పన, మాటతీరు, కొన్ని సన్నివేశాలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పోలి ఉన్నాయనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. అయితే సినిమాలో శంకరన్న పాత్రను నేరుగా కేసీఆర్ పాత్రగా చిత్ర బృందం పేర్కొనలేదు. గోదావరిఖని నేపథ్యంలో సాగే కథలో ఈ పాత్ర కీలక మలుపులకు కారణమవుతుంది.
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”
మరోవైపు ‘ది ప్యారడైజ్’ వసూళ్ల పరంగా వేగంగా ముందుకెళ్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదలైన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్ల గ్రాస్ సాధించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఇది నాని కెరీర్‌లో రెండు రోజుల్లో అత్యంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. అలాగే బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలో 25 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కేటీఆర్ శనివారం రాత్రి సినిమాను థియేటర్‌లో వీక్షించనుండటం మరింత ఆసక్తిని పెంచింది.