Balapur Ganesh Laddu: తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట మరోసారి సరికొత్త ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. విపరీతమైన పోటీ మధ్య సామ ప్రణీత్ రెడ్డి ఈ గణేష్ లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.
హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో అసలైన మాస్ హైలైట్ అంటే బాలాపూర్ లడ్డూ వేలంపాటే.. ప్రతి ఏడాదీ తన సొంత రికార్డులను తానే తిరగరాసే బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డూ ప్రసాదం ఈసారి కూడా సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వేలంలో ఏకంగా రూ. 39 లక్షల ఆల్ టైమ్ రికార్డు ధర పలికి అందరినీ మైండ్ బ్లాక్ చేసింది. సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి పోటీపడి మరీ ఈ పవిత్రమైన లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ. 4 లక్షలు అదనంగా రావడం విశేషం.
25
కంపెనీల ఎంట్రీతో నెక్ట్స్ లెవెల్ కాంపిటీషన్
ఈ ఏడాది లడ్డూ వేలం మామూలుగా జరగలేదు. గత 32 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి బిజినెస్ కంపెనీలు కూడా వేలం రేసులోకి దిగాయి. వేలం పాట కోసం మొత్తం 9 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో ఏకంగా 5 కార్పొరేట్ కంపెనీలు ఉండటం గమనార్హం. స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడంతో పాటు, వచ్చే సోషల్ మీడియా ప్రచారం, బ్రాండ్ ఇమేజ్ కూడా కంపెనీలను ఆకర్షించింది. ఉదయం రూ. 1,116 తో ప్రారంభమైన వేలం పాట.. క్షణాల్లో లక్షలు దాటుకుంటూ రూ. 39 లక్షల దగ్గర ముగిసింది.
35
చిన్న టెక్నికల్ గ్లిచ్.. ఆ తర్వాత పెరిగిన జోష్
శోభాయాత్ర ప్రారంభంలో మంటపం నుంచి గణనాథుడి విగ్రహాన్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించే సమయంలో క్రేన్ సంబంధిత సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఊరేగింపు కాస్త ఆలస్యమై, భక్తుల్లో ఉత్కంఠను మరింత పెంచింది. నిర్వహణ కమిటీ ఆ సమస్యను వెంటనే క్లియర్ చేసి, విగ్రహాన్ని బొడ్రాయి ప్రాంగణానికి తీసుకురాగానే వేలం హడావుడి మొదలైంది. గ్రామంలో ఎటు చూసినా భక్తుల కోలాహలం, జై గణేష్ నామస్మరణలతో వాతావరణం మారుమోగిపోయింది.
రూ. 450 నుంచి రూ. 39 లక్షల దాకా.. 45 ఏళ్ల అద్భుత ప్రయాణం
బాలాపూర్ గణపతి ఉత్సవాలకు 45 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. అయితే ప్రసాదం వేలం పాట సంప్రదాయం 1994లో ప్రారంభమైంది. మొదటిసారి కేవలం రూ. 450 కి లోకల్ రైతు కొలను మోహన్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు. ఆ ప్రసాదాన్ని తన పొలంలో చల్లడంతో మంచి పంటలు పండి, అష్టైశ్వర్యాలు సిద్ధించాయని భక్తుల బలమైన విశ్వాసం. మొదట్లో 15 ఏళ్ల పాటు కేవలం స్థానికులకే అవకాశమివ్వగా, 2009 నుంచి అందరికీ ఛాన్స్ ఇచ్చారు. ఆ నమ్మకమే ఈ రోజు ఈ ప్రసాదాన్ని రూ. 39 లక్షల స్థాయికి తీసుకెళ్లింది.
55
ఖైరతాబాద్ అంత క్రేజ్.. 400 మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ
బాలాపూర్ లడ్డూ ప్రసాదం అంటే కేవలం ఓ భక్తి కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిలో ఒక మైలురాయిగా మారింది. ఈ వేలం పాటను వీక్షించడానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో పోలీసులు పక్కా ప్లానింగ్‌తో బందోబస్తు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిపి సుమారు 400 మంది పోలీసులతో సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ ఈవెంట్ సురక్షితంగా పూర్తయింది. ఈ ప్రసాదాన్ని సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డిపై ఇప్పుడు నెటిజన్లు, భక్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.