
Jubilee Hills Bypoll 2025 : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక హీట్ పెంచింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ఈ ఉపఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి బహిరంగ సభ, రోడ్ షోలతో ప్రచారం చేపట్టారు... మాజీ మంత్రి కేటీఆర్ కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఇక మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు... ఇలా తెలంగాణ రాజకీయ నాయకులంతా గత నెలరోజులుగా జూబ్లిహిల్స్ లోనే తిష్టవేశారు. నిన్న(మంగళవారం) పోలింగ్ ముగిసింది... దీంతో ప్రస్తుతం జూబ్లిహిల్స్ అసెంబ్లీలో సందడి పూర్తిగా తగ్గింది.
ప్రస్తుతం జూబ్లిహిల్స్ లో తుపానుకు ముందు నిశ్శబ్దంలా పరిస్థితి ఉంది. నవంబర్ 14న పలితాలు వెలువడనున్నాయి. ఈ ఎలక్షన్ రిజల్ట్ కేవలం జూబ్లిహిల్స్ కే పరిమితం కాదు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. పలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరో టర్న్ తీసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎవరు గెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
జూబ్లిహిల్స్ గెలుపుపై కాంగ్రెస్ ధీమాతో ఉంది... ఎగ్జిట్ పోల్స్ కూడా అధికార పార్టీదే విజయమని చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లిహిల్స్ విజయం చాలా అవసరం... ముఖ్యంగా హైదరాబాద్ లో పట్టు సాధించాలంటే తప్పకుండా గెలిచి తీరాల్సిందే. అందుకే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం స్వయంగా ప్రచారం చేపట్టారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది... కానీ హైదరాబాద్ లో మాత్రం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిహెచ్ఎంసి పరిధిలో కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్క సీటు రాలేదు... రాష్ట్రమంతా కాంగ్రెస్ కు పట్టంగట్టినా నగరవాసులు బిఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. దీన్నిబట్టి హైదరాబాద్ కాంగ్రెస్ కు పట్టులేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆ పార్టీ విశ్వప్రయత్నం చేస్తోంది... ఈ క్రమంలోనే జూబ్లిహిల్స్ ఉపఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో విజయం ద్వారా హైదరాబాద్ లో తమకు పట్టు ఉందని కాంగ్రెస్ నిరూపించుకోవచ్చు... ఇది రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు ఇతర సందర్భాల్లో చాలా ఉపయోగపడుతుంది.
అధికారంలో ఉండికూడా ఈ ఉపఎన్నికలో గెలవలేకపోతే కాంగ్రెస్ కు రాజకీయంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లే. ఇప్పటికే ప్రతిపక్ష బిఆర్ఎస్ పదేపదే హైదరాబాద్ లో ఓటమిని ప్రస్తావిస్తూ దెప్పిపొడుస్తోంది... ఈ ఉపఎన్నికల్లో ఓడితే మరింత అటాక్ చేస్తుంది. పార్టీ శ్రేణులకు కూడా నైతిక బలం తగ్గుతుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే కాంగ్రెస్ గెలవాల్సిందే.
జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే రాజకీయంగా మరింత బలపడుతుంది... ఇది తమ పాలనకు రెఫరెండంగా చెప్పుకోవచ్చు. తద్వారా రాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పై నమ్మకాన్ని మరింత పెంచుకోవచ్చు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి కూడా చెక్ పెట్టవచ్చు. ఇలా జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే హైదరాబాద్ తో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుతుంది...దీంతో ప్రతిపక్షాలను కట్టడిచేసే వీలుంటుంది.
జూబ్లిహిల్స్ బిఆర్ఎస్ సిట్టింగ్ సీటు... ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఉపఎన్నిక వచ్చింది. వరసగా మూడుసార్లు జూబ్లిహిల్స్ లో ఆయన గెలుస్తూ వస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుతర్వాత ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు ఓటమన్నదే లేదు. సిట్టింగ్ సీటును కాపాడుకుని పట్టు నిలుపుకోవడమే కాదు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎత్తిచూపే అవకాశం ఈ ఎన్నికల ద్వారా బిఆర్ఎస్ కు వచ్చింది. అందుకే అధికార కాంగ్రెస్ ను ఓడించేందుకు బిఆర్ఎస్ శాయశక్తులు ఒడ్డింది.
ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ తారుమారై బిఆర్ఎస్ విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయాలు మారనున్నాయి. జూబ్లిహిల్స్ విజయాన్ని ముందుపెట్టి కాంగ్రెస్ ను కార్నర్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు జిహెచ్ఎంసి ఎన్నికలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుంది. అధికారాన్ని కోల్పోయినా హైదరాబాద్ పై ఏమాత్రం పట్టు సడలలేదని బిఆర్ఎస్ నిరూపించవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని బిఆర్ఎస్ ఇప్పటికే బలంగా ప్రచారం చేస్తోంది. జూబ్లిహిల్స్ లో ఓడిస్తే దీన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రజల్లో కాంగ్రెస్ ను బలహీనపర్చి తాము బలపడేలా రాజకీయాలు నడిపించవచ్చు. ఇదే బిఆర్ఎస్ ప్లాన్ లా కనిపిస్తోంది... అందుకే జూబ్లిహిల్స్ ఎన్నికలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్ గా తీసుకున్నారు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచినా... బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలిచినా ఈ పలితం కేవలం నియోజకవర్గానికే పరిమితం కాదు. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. అంటే ఈ ఎన్నికను రాబోయే జనరల్ అసెంబ్లీ ఎన్నికలకు సర్వేలా భావించవచ్చు. కాంగ్రెస్ గెలిచి, బిఆర్ఎస్ ఓడిపోయి దాదాపు రెండేళ్ళు అవుతోంది.. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎవరివైపు ఉన్నారో ఓ స్పష్టత వస్తుంది. దీన్నిబట్టి రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తంగా జూబ్లిహిల్స్ ఉపఎన్నిక పలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.