Jobs: ఇక‌పై తెలంగాణ యువ‌త‌కు జ‌పాన్‌లో ఉద్యోగాలు.. ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం

Published : Aug 26, 2026, 09:42 PM IST

Jobs: జ‌పాన్‌లో అమ‌ల్లో ఉన్న వృత్తివిద్యా, ప్రాక్టిక‌ల్ శిక్ష‌ణ విధానాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు గాను మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం ఫుకుయామా హయ్యర్‌ టెక్నికల్‌ స్కూల్‌ను సందర్శించింది.

PREV
14
60 శాతం ప్రాక్టికల్‌ శిక్షణకు ప్రాధాన్యం

ఫుకుయామా హయ్యర్‌ టెక్నికల్‌ స్కూల్‌లో నిర్మాణ రంగంతో పాటు టెక్నికల్‌, వెల్డింగ్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ ల్యాబొరేటరీలను మంత్రి వివేక్‌ వెంకటస్వామి పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి కోర్సుల రూపకల్పన, ల్యాబొరేటరీల నిర్వహణ, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందిస్తున్న విధానాన్ని తెలుసుకున్నారు. ఇక్కడ 60 శాతం ప్రాక్టికల్‌ శిక్షణ, 40 శాతం థియరీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. కొత్తగా విద్యలోకి వచ్చే వారితో పాటు గతంలో పని అనుభవం ఉన్నవారికి కూడా ప్రత్యేక కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పరిశ్రమలతో నిరంతరం అనుసంధానం కొనసాగిస్తూ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

24
నిర్మాణం నుంచి ఎలక్ట్రికల్‌ వరకు ప్రత్యేక శిక్షణ

నిర్మాణ రంగానికి సంబంధించిన ల్యాబొరేటరీలో నిర్మాణ పనులు, ఇంటీరియర్‌ వర్క్స్‌పై విద్యార్థులకు అందిస్తున్న శిక్షణను మంత్రి పరిశీలించారు. ఏడాది వ్యవధి ఉండే ఈ కోర్సు ద్వారా ఉద్యోగానికి అవసరమైన ప్రాక్టికల్‌ నైపుణ్యాలను అందిస్తున్న విధానాన్ని ఆయన తెలుసుకున్నారు. టెక్నికల్‌, వెల్డింగ్‌ ల్యాబ్‌లలో ప్రెసిషన్‌ వర్క్‌, ఫ్యాబ్రికేషన్‌, వివిధ విడిభాగాలను అనుసంధానం చేసేందుకు ఉపయోగించే యంత్రాలు, పరికరాలను పరిశీలించారు. పని ప్రదేశంలో క్రమశిక్షణ, భద్రతా ప్రమాణాలు, రక్షణ పరికరాల వినియోగం, యంత్రాల నిర్వహణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రి అభినందించారు. ఎలక్ట్రికల్‌ ల్యాబ్‌లో విద్యార్థులు విద్యుత్‌ వైరింగ్‌పై పొందుతున్న శిక్షణను పరిశీలించి వారితో మాట్లాడారు. స్థానిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను రూపొందిస్తున్నట్లు పాఠశాల అధికారులు వివరించారు.

34
పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలపై శిక్షణ

ఆటోమొబైల్‌ ల్యాబొరేటరీని కూడా మంత్రి సందర్శించారు. రెండేళ్ల కోర్సులో భాగంగా వాహనాల నిర్వహణపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆటోమొబైల్‌ రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ వాహనాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.

ఆధునిక పరికరాలు, ల్యాబొరేటరీల నాణ్యత, నిర్వహణ ప్రమాణాలతో పాటు తరగతి బోధన, ప్రాక్టికల్‌ శిక్షణ, క్రమశిక్షణ, పరిశ్రమల అవసరాలను సమన్వయం చేస్తున్న జపాన్‌ విధానాన్ని మంత్రి ప్రశంసించారు. తెలంగాణలో సాంకేతిక విద్యను మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ–జపాన్‌ మధ్య విద్యార్థుల మార్పిడి

వొకేషనల్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ డైరెక్టర్‌ తకమురా రేకో, ఫుకుయామా హయ్యర్‌ టెక్నికల్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఇండస్ట్రియల్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ డివిజన్‌ డైరెక్టర్‌ ఫినోయిషి హిరోయోషితో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ, జపాన్‌ సాంకేతిక విద్యాసంస్థల మధ్య విద్యార్థుల పరస్పర మార్పిడి, అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించేందుకు తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

నిర్ణీత కాలపరిమితిలో విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు సాంకేతిక విద్య, అధ్యాపకుల మార్పిడి, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి, ప్రాక్టికల్‌ శిక్షణలో పరస్పర సహకారాన్ని విస్తరించాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు విద్య, శిక్షణతో మొదలై అంతర్జాతీయ ఉద్యోగాల వరకు స్పష్టమైన అవకాశాల మార్గాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

44
జర్మనీ తరహాలో జపాన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం

జర్మనీలో తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా TOMCOM ఇప్పటికే విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహిస్తోందని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. అదే తరహాలో జపాన్‌ కోసం కూడా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణ, పరిశ్రమల అనుసంధానం, అభ్యర్థుల సన్నద్ధత, సంస్థల మధ్య సమన్వయంతో వ్యవస్థీకృత కార్యక్రమాన్ని రూపొందించవచ్చని చెప్పారు.

జపాన్‌లో నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్‌ అధికంగా ఉందని, అక్కడ విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. జపాన్‌ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తెలంగాణ నుంచి సిద్ధం చేసి అందించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో జపాన్‌ వెళ్లే యువతకు జపనీస్‌ భాష, అక్కడి సంస్కృతి, పని విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. భాషా ప్రావీణ్యం, సాంస్కృతిక అవగాహన, జపనీస్‌ పని విధానాలపై పరిజ్ఞానం లేకుండా అంతర్జాతీయ ఉద్యోగాల్లో సులభంగా స్థిరపడటం కష్టమని భావిస్తున్న ప్రభుత్వం.. ప్రతి శిక్షణ, ఉద్యోగ కార్యక్రమంలో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక శిక్షణను అభివృద్ధి చేయడం, విద్యార్థుల మార్పిడి పెంచడం, పరిశ్రమల అవసరాలకు తగ్గ నైపుణ్యాలను అందించడం, సంస్థల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచవ్యాప్తంగా మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి వివేక్‌ వెంకటస్వామి తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories